government employees go on mass hunger strike: ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ... రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఏపీజేఎసీ అమరావతి ఉద్యోగ సంఘాలు సామూహిక నిరహారదీక్షలు చేపట్టాయి. 83 రోజులుగా ఉద్యమం చేస్తున్నా.. ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుండటంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ పాదయాత్రలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీకి... నేటికీ అతీగతీ లేదని మండిపడ్డారు. ఉద్యమం ఆగాలంటే ఉద్యోగులు ఇచ్చిన 50 డిమాండ్లను పరిష్కరించడం తప్ప, ప్రభుత్వానికి మరో ప్రత్యామ్నాయం లేదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు.
పీఆర్సీ, ఇతర బకాయిలను ఇంకెప్పుడు చెల్లిస్తారు: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమం తీవ్రస్థాయిలో రూపాంతరం చెందకముందే.. ప్రభుత్వం స్పందించాలని ఏపీజేఎసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ప్రభుత్వం చేసిన తప్పులకు తాము రోడ్డెక్కాల్సి వస్తోందని మండిపడ్డారు. ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించాలంటూ దశల వారీగా... ఏపీజేఎసీ అమరావతి సంఘం ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన సామూహిక నిరాహార దీక్షకు బొప్పరాజు హాజరయ్యారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చింది కానీ, ఇప్పటికీ ప్రభుత్వానికి ఆ వారం రాలేదా... అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. కేంద్రం సూచించిన 14 శాతం పెంపును కూడా అమలు చేయలేదని, పీఆర్సీ, ఇతర బకాయిలను ఇంకెప్పుడు చెల్లిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. డీఏలకు ఇప్పటికీ దిక్కు లేదని బొప్పరాజు ఆక్షేపించారు.
ఉద్యోగులకు అవసరమైతే కాళ్లు పట్టుకునే నేర్పుండాలి.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
అ.ని.శా. దాడులు ఒకవైపు ఉద్యోగులు తమ సమస్యల సాధనకు పోరాడుతుంటే.. ప్రభుత్వం మాత్రం తమపై అనిశా దాడులు చేస్తూ... బెదిరింపులకు పాల్పడుతోందని బొప్పరాజు వెంకటేశ్వర్లు మండిపడ్డారు. రాబోయే కాలంలో ఉద్యమం అంతా ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగులదేనని బొప్పరాజు వెల్లడించారు.
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలి: ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో... ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ... శ్రీకాకుళం అంబేద్కర్ కూడలి వద్ద సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఇచ్చిన నివేదికలోని అంశాలతో పాటు పీఆర్సీ అమలు, బకాయిల చెల్లింపులను వెంటనే చెల్లించాలని ఉద్యోగ సంఘం నేతలు డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీజేఎసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నంద్యాల కలెక్టరేట్ వద్ద ఏపీఆర్ఎస్ఏ నాయకులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్నా... ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమన్నారు.
Electrical employees strike: ఏప్రిల్ 17 నుంచి విద్యుత్ ఉద్యోగుల సమ్మె..!