AP Health Department Anger: ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలు మనోభావాలతో ఆడుకుంటూ కోట్లల్లో సంపాదిస్తున్నారు. ముఖ్యంగా సిజేరియన్ ప్రసవాల విషయంలో దారణంగా వ్యవహరిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యం. రాష్ట్రంలో ఎక్కువగా సిజేరియన్ ప్రసవాలు జరగడంపై ఆరోగ్యశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమైన ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు ప్రైవేటు ఆస్పత్రులను హెచ్చరించారు.
ప్రాణాంతకంగా మారుతున్న సిజేరియన్లు: ప్రైవేటు ఆస్పత్రులు సిజేరియన్ ప్రసవాలు చేస్తే ఆరోగ్య శ్రీ గుర్తింపును రద్దు చేస్తామని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటి కృష్ణబాబు హెచ్చరించారు. సిజేరియన్ ఆపరేషన్ల విషయంలో సమాజానికి అన్యాయం చేయొద్దని ఆయన ప్రైవేటు ఆస్పత్రులు, వైద్యులకు సూచించారు. సహజ సిద్ధమైన రీతిలో ప్రసవాలు జరిగేలా చూడాలని, ప్రాణాంతకంగా మారుతున్న సిజేరియన్ల జోలికి పోవద్దని ఆయన స్పష్టం చేశారు. గైనకాలజిస్టులు, ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమావేశమైన ఆయన.. వందశాతం సిజేరియన్ ఆపరేషన్లు నిర్వహించిన ఆస్పత్రుల నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బును సంపాదించాలనే ధ్యేయంగా ఆసుపత్రుల్ని నడపొద్దని హితవు పలికారు.
అధిక సిజేరియన్ ఆపరేషన్లు ఏపీలోనే: దేశంలోనే అధిక సిజేరియన్ ఆపరేషన్లు ఏపీలోనే జరగడం అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతి పదివేల మందికి 19.5 శాతం మంది డాక్టర్లు ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ మాత్రమేనని కృష్ణబాబు స్పష్టం చేశారు. ఇక నుంచి అధిక సిజేరియన్ ఆపరేషన్లు చేసే ఆసుపత్రులను ఆడిట్ చెయాల్సిందిగా వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డీఎంహెచ్ఓలను ఆదేశించారు. ఇకనుంచి ఏపీలో సిజేరియన్ ఆపరేషన్లు గణనీయంగా తగ్గాలనీ, డబ్ల్యూహెచ్వో నిబంధనల ప్రకారం 10 నుండి 15 శాతం మేర మాత్రమే సిజేరియన్లు జరగాలన్నారు. సంక్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే సిజేరియన్ శ్రస్త్రచికిత్సలను చేయాల్సిందిగా సూచించారు. గత ఏడాది కాలంలో ఏపీలో 42.7 శాతం ప్రసవాలలో సిజేరియన్లు కాన్పులే ఉండటం అవమానకరమని స్పష్టం చేశారు. ఇప్పటినుంచి సిజేరియన్లు పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఇవీ చదవండి