Flower Show: నేటి బిజీ బిజీ సమయంలో ప్రజలు మానసిక ప్రశాంత కోసం గార్డెన్ పెంపకం, రకరకాల పూలు, పండ్ల మొక్కల పెంపకం మీద దృష్టి సారిస్తున్నారు. తమ ఇంటిని చూడడానికి ఆకర్షణీయంగా ఉంచాలని ప్రతీ వారు కోరుకుంటారు. అలాంటి వారి కోసం విజయవాడ ఎంజీ రోడ్డులో ఏర్పాటు చేసిన ఏపీ ఫ్లవర్ షో స్థానికులను కట్టిపడేస్తోంది. ఇందులో అరుదైన పుష్ప జాతులు కనువిందు చేస్తున్నాయి. గులాబీల గుభాళింపు మైమరపిస్తోంది, మందారాల వయ్యారాలు, చామంతులు ఆకట్టుకుంటున్నాయి.
బహిరంగ మార్కెట్లో కంటే ఈ ప్రదర్శనలో దొరికే మొక్కల ధరలు తక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలు మరిన్ని పెడితే మరింత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. పూల మొక్కలతో పాటు మిద్దె తోటకు అవసరమైన వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరల విత్తనాలు లభిస్తున్నాయని ఆనందపడుతున్నారు. పుష్ప ప్రదర్శనలో రాష్ట్రానికి చెందిన వ్యాపారులే కాక వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ ఉత్పత్తులు అమ్ముకుంటున్నారు. మొక్కలకు అవసరమైన కుండీలతో పాటు ఇంటి అలంకారానికి పనికొచ్చే సామగ్రినీ విక్రయిస్తున్నారని నిర్వహకులు చెబుతున్నారు.
తమ ఇంటిని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దడానికి కావల్సిన మొక్కలు, అలంకార సామాగ్రి కోసం వివిధ నర్సరీలు సందర్శించకుండా ఒకే చోట దొరకడం వల్ల తమకు సమయంతో పాటు డబ్బు ఆదా అవుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫ్లవర్‌షో ఇవాళ, రేపు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఇవీ చదవండి: