YSR KALYANAMASTHU, SHADI THOFA SCHEEMS FUNDS RELEASE: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు సంబంధించిన నిధులను బటన్ నొక్కి విడుదల చేశారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకూ (త్రైమాసికం) వివాహం చేసుకొని, అర్హత పొందిన.. 12వేల 132 మంది లబ్ధిదారులకు రూ.87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని జమ చేశామన్నారు. అనంతరం ఈ రెండు పథకాలకు 10వ తరగతి నిబంధన పెట్టడానికి గల కారణాలు ఏమిటో సీఎం జగన్ వివరించారు.
రూ. 87.32 కోట్ల నిధులు విడుదల.. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..''ప్రతి కుటుంబంలో పేదరికం పోవాలంటే చదువనే దివ్యాస్త్రం అందరికీ అందుబాటులోకి రావాలి. పేదరికం పోయేందుకు చదువు ఒక్కటే మార్గం. పేదల పిల్లలు బాగా చదవుకునేలా ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈరోజు వైఎస్సార్ కళ్యాణమస్తు,షాదీ తోఫా పథకాల నిధులను మరోసారి బటన్ నొక్కి విడుదల చేస్తున్నాం. జనవరి–మార్చి త్రైమాసికంలో వివాహం చేసుకుని, అర్హత పొందిన వారికి ఆర్ధిక సాయం చేస్తున్నాం. దాదాపు 12 వేల 132 మంది లబ్ధిదారులకు రూ. 87.32 కోట్ల ఆర్ధిక సాయాన్ని జమ చేస్తున్నాం.'' అని ఆయన అన్నారు.
అందుకే ఆ నిబంధన కచ్చితంగా పెట్టాం.. అనంతరం నేడు విడుదల చేసిన నిధులలో.. కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలో, ఒకే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో నిధులను జమ చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. పేదలు తమ పిల్లలను కనీసం పదో తరగతి వరకైనా చదివిస్తారనే ఆలోచనతోనే వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలకు చదువు అనే నిబంధనను కచ్చితంగా పెట్టామన్నారు. ఉన్నత చదువులు చదివేందుకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తూ.. డిగ్రీవరకు చదుకునే సదుపాయం కల్పిస్తున్నామన్నారు.
ఆ పథకాల ద్వారా పిల్లలు డిగ్రీ వరకు చదువుకోవచ్చు.. అమ్మాయికి 18 ఏళ్లు, అబ్బాయికి 21 ఏళ్లు ఉండాలన్న నిబంధన అమలు చేస్తున్నామన్న సీఎం జగన్.. అమ్మాయి వయసు 18 ఏళ్లు వచ్చేసరికి కనీసం ఇంటర్ విద్య పూర్తి చేసే అవకాశం ఉందని గుర్తు చేశారు. వీటితో పాటు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన కింద అమలు చేస్తుండటం వల్ల పిల్లలు డిగ్రీ వరకు చదువుకోవచ్చని సూచించారు. పిల్లలు డిగ్రీ పాసైతే మెరుగైన ఉద్యోగం వస్తుందని, ఉద్యోగం వచ్చినపుడే పేద కుటుంబాలు బయటకు రాగలుగుతాయన్నారు. 12 వేల 132 జంటల్లో 5929 జంటలు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పొందుతున్నట్లు తెలిపారు.
కులాంతర వివాహాలకు అధిక ప్రాధాన్యత.. చివరగా.. ప్రతి పేద కుటుంబం పేదరికం నుంచి బయటకు రావాలని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంచి జరగాలనే అడుగులు వేస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ.1 లక్ష 20 వేల చొప్పున సాయం అందించామన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద లక్ష రూపాయలు ఇచ్చినట్లు వెల్లడించారు. బీసీలకు రూ. 50 వేలు, బీసీల్లో కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ. 75 వేలు, విభిన్న ప్రతిభావంతులకు రూ. 1 లక్ష 50 వేలు, భవన, ఇతర నిర్మాణ కార్మికులకు రూ. 40 వేల చొప్పున సాయం అందించామని జగన్ వివరాలను వెల్లడించారు.
ఇవీ చదవండి