Srisailam Trust Board Member Audio: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా.. భూమిపై వెలసిన కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీశైలంలో వరుస వివాదాలు కలకలం రేపుతున్నాయి. లడ్డూ టెండర్లలో అవినీతి బయటపడిన కొద్దిరోజులకే.. దర్శనాల దందా ఆడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ధర్మకర్తల మండలిలోని ఓ సభ్యురాలు.. అక్రమంగా దర్శనాలు చేయించి డబ్బులు వసూలు చేయాలన్న ఆడియో హల్‌చల్ చేస్తోంది.
వైరల్‌గా మారిన ఆడియో: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తాజాగా మరో వివాదం వెలుగులోకి వచ్చింది. దేవస్థానంలో దర్శనాల దందా ఆడియో కలకలం సృష్టిస్తోంది. ధర్మకర్తల మండలిలోని ఓ సభ్యురాలు.. దర్శనాలకు సంబంధించి టికెట్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అభిషేకం, దర్శనం చేయించి.. భక్తుల నుంచి డబ్బులు వసూలు చేయాలని సహాయకుడికి చెబుతున్నట్లుగా ఉన్న ఆడియో... సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వామివారి గర్భాలయ టికెట్లు లేకపోయినా దర్శనాలు చేయిస్తామంటూ ధర్మకర్తల మండలి సభ్యురాలు చెబుతున్నట్లుగా అందులో ఉంది. వరుసగా బయట పడుతున్న అక్రమాలు, పాలకమండలి తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
20 ఏళ్లుగా ఒకే గుత్తేదారు: శ్రీశైల దేవస్థానం లడ్డూ తయారీ కోసం.. సరుకుల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగాయన్న విషయం ఈ మధ్యనే కలకలం రేపింది. ఆలయ కమిటీ జరిపిన అంతర్గత విచారణలో ఈ విషయాలు బహిర్గతం అయ్యాయి. జీడిపప్పు, యాలకులు సహా నెయ్యి, నూనె తదితర సరుకులకు వాస్తవ ధర కన్నా ఎక్కువగా చెల్లిస్తున్నట్లు తేలింది. ఒక్క నెలలో 42 లక్షల రూపాయలు అదనంగా చెల్లిస్తున్నారని ఛైర్మన్ చక్రపాణిరెడ్డి అధికారులను నిలదీశారు. ఒకే గుత్తేదారు 20 ఏళ్లుగా ఉన్నాడని.. అంటే ఈ కుంభకోణం కోట్లలో ఉండే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. ఈ విషయం మరువక ముందే.. పాలకమండలి సభ్యురాలి ఆడియో శ్రీశైలం ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో వరుసగా బయటపడుతున్న అవకతవకలపైప్రభుత్వం స్పందించి.. విచారణ జరిపించి... భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని భక్తులు కోరుతున్నారు.
అక్రమంగా దర్శనాలపై విచారణ: శ్రీశైల క్షేత్రంలోని ధర్మకర్తల మండలి సభ్యురాలు అక్రమంగా దర్శనాలకు పాల్పడుతున్న వైనంపై దేవస్థానం అధికారులు విచారణ చేపట్టారు. సహాయ కమిషనర్ హెచ్.జి వెంకటేష్, ఈఈ రామకృష్ణ, ఏఈవోలు మోహన్, శ్రీనివాసరెడ్డిలను కమిటీగా ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ధర్మకర్తల మండలి సభ్యురాలి వద్ద సహాయకుడిగా పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగిని పిలిచి అధికారుల కమిటీ విచారించింది. నిన్న రాత్రి విచారణ పూర్తి చేశారు. విచారణ నివేదికను ఈవో ఎస్. లవన్నకు సమర్పించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి: