Nandyala People Suffering With Industrial Pollution : జిల్లా కేంద్రమైన తర్వాత మరిన్ని వసతులతో వెలుగొందాల్సిన నంద్యాల పరిశ్రమల కాలుష్యంతో కొట్టుమిట్టాడుతోంది. పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థ జలాలు పంట పొలాల్లోకి చేరి పాడైపోతున్నాయి. కాలుష్య నియంత్రణ అధికారులు చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Industrial Pollution in Nandyal Town : నంద్యాలలోని పరిశ్రమలు కాలుష్యానికి నిలయాలుగా మారాయి. నంద్యాల సమీపంలోని నూనెపల్లె, రైతునగరం, అయ్యలూరు మెట్ట, చాబోలు, కానాల గ్రామాల పరిధిలో 11 పత్తి, 16 వరి విత్తన శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. మరోవైపు పట్టణ శివారుల్లో విజయ డైరీ, ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటి నుంచి భారీగా వచ్చే కలుషిత జలాలు వాగులు, వంకల్లో చేరి,అక్కడి నుంచి కుందూ నదిలో కలుస్తున్నాయి. కుందూనది నీటిపై ఆధారపడి పంటలు పండించే వేలాది ఎకరాల్లో ఈ కలుషిత నీరు చేరి పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోందని రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Crop Fields Damage With Industrial Waste in Nandyal Town : అక్టోబర్ మాసంలో వరి, పత్తి విత్తనాల శుద్ధి ప్రక్రియ ప్రారంభం అవుతుంది. దీని కోసం సల్ఫ్యూరిక్ యాసిడ్, ఆల్కలైన్ లను వినియోగిస్తారు. ఈ వ్యర్థాలను ఫ్యాక్టరీల నుంచి బయటకు రాకుండా చూడాలి. కానీ దీనికి విరుద్ధంగా.. యథేచ్ఛగా నదుల్లో కలిపేస్తున్నారు. విజయ పాల డైరీ, ఎస్పీవై రెడ్డి ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ.. ఇష్టారాజ్యంగా కుందూ నదిలో కలుపుతున్నారు. ఈ నీరు పంటలకు వినియోగించటం వల్ల నేల స్వభావం దెబ్బతిని వరి, జొన్న, మిరప పంటల దిగుబడి తగ్గిపోతోంది. నేల కఠినంగా మారి భూసారం దెబ్బతింటోంది. మరోవైపు ఈ దుర్గంధం వల్ల శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఈ వ్యర్థాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
పరిశ్రమల కోసం భూములిచ్చాం.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్తున్నాం..!
"కాలుష్యం నుంచి మా ప్రాణాలు కాపాడండి : కొత్తగా నంద్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడింది. జిల్లా కేంద్రానికి ఉండానికి ఉండాల్సిన కనీస వసతులు, సౌకర్యాలు ప్రభుత్వం ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు. దీనికి తోడు నంద్యాల పట్టణంలో ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల కారణంగా కాలుష్యంతో సతమతం అవుతున్నాము. గతంలో వ్యర్థాల నుంచి పట్టణాన్ని కాపాడాలని ఆందోళన చేశాం. కానీ అధికారులు ఎవరూ పట్టించుకోలేదు. కుందూ నదిలో వ్యర్థాలు చేరడంతో తాగునీటికి ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలుష్యం నుంచి మా ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు."- నంద్యాల ప్రజలు
ప్రభుత్వం స్పందించాలని వేడుకోలు : నంద్యాల పట్టణంలోని పరిశ్రమల వ్యర్థ జలాల వల్ల గతంలో కుందూ నదిలో పెద్ద ఎత్తున చేపలు మృతి చెందాయి. పంటలు దెబ్బతింటున్నాయని రైతులు ఆందోళన నిర్వహించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి కాలుష్యం నుంచి తమను ప్రాణాలను కాపాడాలని స్థానిక ప్రజలు వేడుకుంటున్నారు.