Huge Irregularities in Jaladurgam Village MGNREGA Works : ఉపాధి హామీలో అక్రమాలు జరుగుతున్నాయని నంద్యాల జిల్లాలోని జలదుర్గం గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. కూలీలు పనులకు వెళ్లకపోయినా.. వారి ఖాతాల్లో నగదు జమ చేసి కోట్ల రూపాయలు స్వాహ చేశారని అంటున్నారు. ఈ అక్రమాలలో అధికారులు, వైసీపీ నాయకులు కుమ్మక్కయ్యారని.. ఈ అక్రమాలు గత నాలుగు సంవత్సరాలుగా సాగుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.
ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలోని కొంతమంది ఉపాధి హమీ కూలీలు పనులకు వెళ్లకున్న.. వారి ఖాతాల్లో నగదు జమ అవుతోందని జలదుర్గం గ్రామస్థులు అంటున్నారు. ఖాతాల్లో జమైన నగదులో అధికారులకు, వైసీపీ నేతలకు వాటలు ఇస్తే చాలు.. నేరుగా ఖాతాల్లో నగదు జమ చేస్తారని వివరించారు. పనికి వెళ్లకపోయినా నగుదు జమైనా కూలీలే ఈ వివరాలను వెల్లడించటం గమనార్హం.
గత నాలుగు సంవత్సరాలుగా ఇదే తంతూ సాగుతోందని.. గతంలో చేసిన పనులకే కొన్ని కొస మెరుపులు దిద్దుతున్నారని గ్రామస్థులు వివరించారు. ఆ పనులు చేపట్టడానికి కూలీలు వెళ్లినట్లు లెక్కలో చూపిస్తున్నారని వెల్లడించారు. ఇలా పనులకు వెళ్లినట్లు చూపి ఉపాధి వేతనాలు కూలీల ఖాతాల్లో జమ చేస్తున్నారని అన్నారు. ఈ విధంగా దాదాపు కోటి రూపాయల వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపిస్తున్నారు. ఒకరిద్దరూ కాదు గ్రామంలో వందలాదిమంది పనులకు వెళ్లకపోయినా.. వారి పేర్లతో బిల్లులు మంజూరు చేయించుకుని అదికారులు, వైసీపీ నాయకులు వాటాలు పంచుకున్నారని అంటున్నారు.
Irregularities in MGNREGA Works: ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. సామాజిక తనిఖీల పేరుతో భారీగా దోపిడీ
గ్రామంలోని ఉపాధి హామీ జాబ్ కార్డులు, జమైనా నగదు వివరాలు..
- జలదుర్గం గ్రామంలోని జాబ్ కార్డులు సంఖ్య 1426 కాగా.. ఇందులో 2వేల 532 మంది కూలీలు ఉన్నారు.
- మొత్తం కార్డుల్లో 1056 యాక్టివ్గా ఉన్నాయి.
- 2019-20 ఆర్థిక సంవత్సరంలో 879 కుటుంబాలు పని చేస్తే 47 లక్షల 63 వేల రూపాయలు వారి ఖాతాల్లో నమోదైనట్లు లెక్కల్లో చూపెట్టారు.
- 2020-21లో 824 కుటుంబాలకు 52 లక్షల అరవై మూడు వేల రూపాయలు.
- 2021-22లో 548 కుటుంబాలకు 53 లక్షల 24 వేల రూపాయలు.
- 2022-23లో 630 కుటుంబాలకు 88 లక్షల పదకొండు వేల రూపాయలు.
- 2023-24 లో 752 కుటుంబాలు పని చేయగా 90 లక్షల 47 వేల రూపాయలు ఖర్చు చేసినట్లు వివరాలు చూపించారు.
NREGA Labour concerns: ఉపాధి హామీ సొమ్ము గోల్మాల్ వ్యవహారంలో కొనసాగుతున్న కూలీల నిరసన
గ్రామ సమీపంలోని ఊరకుండలోని సర్వే నెంబర్ 1197లో.. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయంలో ట్రీంచింగ్ పనులు చేపట్టారు. ఏళ్ల కిందట చేసిన పనులకు గ్రామంలోని కొందరు కూలీలు పనులకు వెళ్లినట్లు చూపించి.. వేతనాలు వారి ఖాతాల్లో జమ చేశారు. రామ రత్నగిరి సమీప కొండ ప్రాంతంలోనూ, ప్రభుత్వ, అటవీ భూముల్లోనూ పనులు చేసినట్లు లెక్కల్లో చూపించారు. ఎప్పుడో చేసిన వాటికి కొలతలు వేసి కూలీలు పనులకు వెళ్లినట్లు చూపించి నిధులు స్వాహా చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.
ఖాతాల్లో జమ చేసిన నగదును సగభాగం గ్రామంలో నాయకులకు, సగ భాగం జాబ్ కార్డు ఉన్న వారికి.. ఈ విధంగా విభజించి వాటాలు పంచుకున్నారు. ఖాతాలో పడిన డబ్బులను సగభాగం ఇవ్వకపోతే.. తర్వాత జమయ్యే సమయంలో వారి ఖాతాల్లో నిధులు జమచేసేవారు కాదని గ్రామస్థులు వివరించారు. ఖాతాల్లో జమైనా నగదులో అధికారులకు, నాయకులకు వాటలిచ్చిన వారికే నగదు జమ చేసేవారని అంటున్నారు.
ఉపాధి హామీ పథకంలో అక్రమాలు.. కూలీల కష్టాన్ని దోచుకుంటున్న ఫీల్డ్ అసిస్టెంట్
జలదుర్గం గ్రామంలో గత నాలుగేళ్లుగా చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి.. ఇటీవలే గ్రామంలో కొన్ని సామాజిక బృందాలు తనిఖీ నిర్వహించినట్లు గ్రామస్థులు వివరిస్తున్నారు. పనులకు వెళ్లకపోయినా నగదు జమైనా విషయం ఎందుకు బయటపడలేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గ్రామంలో లేని వారి పేర్లతో నిధులు పక్కదారి పట్టించిన అక్రమాలు ఎందుకు బయటపడలేదనే విమర్శలున్నాయి. అంతేకాకుండా ఈ అక్రమాలపై ఉన్నతాధికారులకు గ్రామస్థులు ఫిర్యాదు చేసినా.. ఎందుకు విచారణ చేపట్టలేదని గ్రామస్థులు అంటున్నారు.
"ఐదో నెల 12 తారీఖు 2020 సంవత్సరంలో నాకు నా భార్యకు 1200 రూపాయలు ఖాతాల్లో జమయ్యాయి. ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చి జమైనా నగదుని మూడు భాగాలు చేయమన్నారు. ఎందుకని అడిగితే.. మండల స్థాయి నాయకులకు ఓ భాగమని, ఫీల్డ్ అసిస్టెంట్లకు ఓ భాగమని.. మర భాగం ఖాతాలో జమైనా వారికని అన్నారు." -చాంద్ బాషా, గ్రామస్థుడు
"2019 సంవత్సరం నుంచి 2023 వరకు ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. దీనిపై అధికారులకు నాయకులకు వివరించిన కానీ పట్టించుకోలేదు. పనికి వెళ్లకున్నా కానీ, నా ఖాతాలో నగదు జమ చేశారు. ఈ విధంగా చాలా మంది ఖాతాల్లో నగదు జమ చేశారు." -బాల మద్దయ్య, గ్రామస్థుడు
వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు.. ఆత్మహత్యే శరణ్యమంటున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్.. ఆడియో లీక్