Women police murdered at dhone: అనుమానంతో ఓ మహిళా పోలీసును.. ఆమె భర్తే గొంతు కోసి హత్య చేసిన ఘటన.. కర్నూలు జిల్లా డోన్ మండలం వెంకటనాయునిపల్లె గ్రామంలో జరిగింది. బాలలక్ష్మీదేవికి వెల్దుర్తి మండలం గువ్వలకుంట్ల గ్రామానికి చెందిన సుధాకర్‌తో జులై 2020 లో వివాహం జరిగింది. వెంకటనాయునిపల్లె గ్రామ సచివాలయంలో.. మహిళా పోలీసుగా బాలలక్ష్మీదేవి విధులు నిర్వహిస్తున్నారు. సుధాకర్ కూడా నంద్యాల మండలంలో వార్డ్ వెల్ఫేర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
సుధాకర్ భార్యపై అనుమానంతో తరుచూ వేధింపులకు గురిచేసేవాడు. అయితే బాలలక్ష్మీదేవి విధులు ముగించుకుని సహోద్యోగి రాంప్రసాద్‌తో కలసి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా.. సుధాకర్ గ్రామ సమీపంలో ఉన్న మారెమ్మ గుడి వద్ద కాపు కాసి భార్యను హత్య చేసి పరారయ్యాడు. కత్తితో గొంతు కోయటంతో.. బాలలక్ష్మీదేవి అక్కడికక్కడే మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. రాంప్రసాద్‌ను విచారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
గతంలో కూడా రెండు సార్లు ఆమెపై సుధాకర్ దాడి చేయగా.. డోన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. సుధాకర్, బాలలక్ష్మీదేవి విడాకుల కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నట్లు.. మృతురాలి తండ్రి చౌడప్ప తెలిపారు.
ఇదీ చదవండి: తాగి ఊగుతూ పాఠశాలకు ప్రధానోపాధ్యాయుడు.. ఆపై..