ఆత్మీయ సంబంధాలను తెలియపరుస్తూనే...గొప్ప రాజ్య పాలనా విశేషాలను చెప్పే కావ్యం రామాయణం. అలాంటి అద్భుత రచన చేసిన వ్యక్తి వాల్మీకి . నేడు ఆ మహనీయుని పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.
సమాజానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి వాల్మీకి : కాల్వ శ్రీనివాసులు
అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల అనురాగం, పితృవాక్య పరిపాలన లాంటి ఎన్నో విషయాలను చెప్పిన మహా వ్యక్తి అని తెదేపా నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భంగా అనంతపురంలోని పాతూర్ లో ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఉత్సవాలను జరుపుకున్నారు. నైతిక విలువలు, కుటుంబ బాధ్యతలను ఆచరించేలా సమాజానికి స్ఫూర్తినిచ్చారని కొనియాడారు.
భావితరాలకు ఆదర్శం వాల్మీకి మహర్షి: ఉమామహేశ్వర నాయుడు
ఎన్నో మానవతా విలువలు కలిగిన రామాయణాన్ని రచించిన వాల్మీకి మహర్షి భావి తరాలకు ఆదర్శనీయమని తెలుగుదేశం నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు పేర్కొన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం లో వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే ఉష శ్రీ చరణ్ తో పాటు అన్ని పార్టీలకు చెందిన పలువురు నాయకులు విడివిడిగా పాల్గొని వాల్మీకి జయంతి వేడుకలు చేసుకున్నారు. వాల్మీకి విగ్రహానికి పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అలాగే స్థానిక ఆర్డీవో కార్యాలయంలో...అధికారి రామ్మోహన్ వేడుకల్లో పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరు వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలి: కడప జాయింట్ కలెక్టర్ గౌతమి
వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించారని, సంస్కృత భాషకు ఆది కవిగా ప్రసిద్ధి చెందారని కడప జాయింట్ కలెక్టర్ గౌతమి అన్నారు. వాల్మీకి మహర్షి జయంతిని పురస్కరించుకొని కడప లోని ఆయన విగ్రహానికి జాయింట్ కలెక్టర్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. వాల్మీకి కులస్తులకు ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని వాటన్నింటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరు వాల్మీకిని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం పలు సంఘాల నాయకులు వాల్మీకి విగ్రహానికి పూలమాల వేశారు.
చీమల పుట్టను ఛేదించి జ్ఞానోదయం పొందిన వ్యక్తి వాల్మీకి : డా. జి.సి.కిషోర్ కుమార్
అంధకారం, అజ్ఞానం, చెడుల నుండి బయట పడితే మహర్షులవుతారని,సర్వకాల సర్వావస్తల యందు గుర్తు పెట్టుకోవలసిన వ్యక్తి వాల్మీకి అని డా. జి.సి.కిషోర్ కుమార్ తెలిపారు. మానవ జీవన విధానం ఎలా ఉండాలి అనే అంశాలను తాను రాసిన రామాయణం ద్వారా స్ఫురణకు వస్తుందన్నారు. విజయనగరం కలక్టరేట్ ఆడిటోరియం లో వాల్మీకి జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గన్నారు. పురుషుడు రామునిలా, స్త్రీ అంటే సీత లా ఉండాలని ఒక దశ, దిశ చూపి జాతి నిర్మాణం చేసిన వ్యక్తని పేర్కొన్నారు. రామాయణాన్ని ప్రపంచమంతట పారాయణం చేస్తారని, రామాయణం అంటే వాల్మీకి రామాయణమే ప్రామణికమైనదని భావిస్తారని అన్నారు. మహర్షి వాల్మీకిని స్థిత ప్రజ్ఞతకు గుర్తుగా చెప్పుకోవాలని, ఘోర తపస్సు చేసి తనపై చేరిన చీమల పుట్టను ఛేదించి జ్ఞానోదయం పొందారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన ఇంచార్జ్ కలెక్టర్ డా. జి.సి కిశోర్ తో పాటు సంయుక్త కలెక్టర్ లు ఆర్.మహేష్ కుమార్, జే, వెంకట రావు, ట్రైనీ కలెక్టర్ కే. సింహాచలం , జిల్లా రెవిన్యూ అధికారి కె..గణపతి రావులు జ్యోతిని వెలిగించి, మహర్షి వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేశారు.
ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలి : ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శనివారం వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని శాంతినగర్ లో భక్తకన్నప్ప విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా రాయదుర్గం వాల్మీకి సేవా సంఘం ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి చిత్రపటాన్ని మేళతాళాలు డబ్బులతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొని స్వయంగా వాల్మీకి ఊరేగింపు వాహనాన్ని నడుపుతూ ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశారు. ప్రతి ఒక్కరూ వాల్మీకి మహర్షి ని ఆదర్శంగా తీసుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రభుత్వ విప్ పిలుపునిచ్చారు.
వాల్మీకులను ఎస్టీ జాబితాలోకి చేర్పించాలి : బీవీ జయనాగేశ్వర రెడ్డి
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో వాల్మీకి జయంతి ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి నివాళులు అర్పించారు. వాల్మీకి సంఘం నాయకులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ వర్గాన్ని ఎస్టీలోకి చేర్పించేందుకు గత ప్రభుత్వం శాసనసభ లో తీర్మానించిందని గుర్తు చేశారు.
'రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడు వాల్మీకి'
అనంతపురం జిల్లా ధర్మవరంలో వాల్మీకి మహర్షి జయంతి ఘనంగా నిర్వహించారు. ఆ సంఘం నాయకులు రవిచంద్ర రాజన్న సంఘం యువజన నాయకుడు చంద్రశేఖర్.... విగ్రహానికి పూలమాల వేశారు. రామాయణ మహా కావ్యాన్ని ప్రపంచానికి అందించిన మహనీయుడని మహర్షిని కీర్తించారు.