నది సాగితేనే మానవులకు మనుగడ. అలాంటి నదీ తీరంలోని గ్రామాల ప్రజలకు, రైతులకు వరప్రదాయనిగా తుంగభద్ర నిలుస్తోంది. వేణీ, మలప్రభ, ఘటప్రభ, భీమా నదులు కలుస్తున్న కృష్ణా నదిలో తుంగ, భద్ర కలవడం వల్ల షణ్ణదీ సంగమంగా పిలుస్తారు.పుష్కర సన్నాహాల్లో ఉన్న తుంగభద్రమ్మ జన్మస్థలం నుంచి కృష్ణమ్మ ఒడిలో చేరేంత వరకూ లక్షలాది ఎకరాల్ని సస్యశ్యామలం చేస్తూ కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది. పడమటి కనుమల్లో గంగమూల వద్ద జన్మించే తుంగ, భద్ర నదులు వేర్వేరుగా 170 కిలోమీటర్ల పొడవునా ప్రవహించాకే అఖండ తుంగభద్రగా మారి కృష్ణమ్మలో కలిసే వరకూ అనేక ఆనకట్టలు, తటాకాల్లో సేద దీరి ముందుకు సాగుతోంది.
శివమొగ్గ జిల్లాలో తుంగా జలాశయం, భద్ర జలాశయం, గదగ జిల్లాలో సింగటలూరు ఎత్తిపోతల పథకం, ఆపై దిగువకు సాగి హొసపేటె వద్ద తుంగభద్ర జలాశయం మహానిర్మాణ జాబితాలో చేరేవే. అక్కడి నుంచి ప్రవహిస్తూ..రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ మళ్లింపు పథకంతో మూడు ప్రాంతాల ప్రజలను పలుకరిస్తోంది. ఆ దిగువన మరెన్నో తటాకాలతో హరిత విప్లవానికి తనవంతు సహకరిస్తోంది. విజయనగర రాజుల కాలంలోనే దిగువన ప్రవహించే నీటిని ఏ విధంగా ఎత్తులో ఉన్న హంపీ ప్రాంతానికి నీటిని సమకూర్చవచ్చో ఆనాటి పాలకులు ఇంజినీరింగ్ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికీ హంపీలో రాయ కాలువ, తుర్తు కాలువ, బసవణ్ణ కాలువ, విజయనగర రాజులకు సాగునీటి రంగంపై ఉండిన ఆసక్తికి నిదర్శనాలుగా ఉన్నాయి.
తుంగభద్ర నదుల జన్మస్థలం.. గంగమూల
శివమొగ్గ జిల్లా గాజనూరు వద్ద నిర్మించిన తుంగ ఆనకట్ట ద్వారా శివమొగ్గ జిల్లాకు, భద్ర జలాశయం వల్ల శివమొగ్గ, చిక్కమంగళూరు, దావణగెరె, హావేరి జిల్లాలకు, సింగటలూరు ఎత్తిపోతల పథకం వల్ల ముండర్గి, హూవిన హడగలి ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. పడమటి కనుమల్లో కురిసే భారీ వర్షాలకు రాష్ట్రంలోనే మెదటగా భర్తీ అయ్యే జలాశయంగా ‘తుంగా’కు పేరుంది. హొసపేటె వద్ద నిర్మించిన భారీ జలాశయంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ జలాశయ ఆధారిత తుంగభద్ర కుడి దిగువ కాలువ, కుడి ఎగువ కాలువలు..కరవును పారదోలడానికి నిత్యం సహకరిస్తున్నవే.టీబీ జలాశయం నుంచి ఆర్డీఎస్ (రాజోలిబండ) వరకు 120 కి.మీ, ఆర్డీఎస్ నుంచి మంత్రాలయం వరకు 40కి.మీ, మంత్రాలయం నుంచి సుంకేసుల జలాశయం వరకు 60 కి.మీ, సుంకేసుల నుంచి సంగమేశ్వరం వరకు 115 కి.మీ మొత్తం 335 కి.మీ ప్రవహించి కృష్ణాలో కలుస్తోంది.
తుంగభద్ర జలాశయం..
తుంగభద్ర నదిని రామాయణ కాలంలో పంపానదిగా పిలిచేవారు. దక్షిణ భారతదేశ..మధ్య యుగ చరిత్రలో వెలసిన విజయనగర సామ్రాజ్యం తుంగభద్ర నది ఒడ్డునే వెలిసింది. హంపీ, మంత్రాలయం, అలంపూర్, సంగమేశ్వరం, గురజాల వంటి ప్రసిద్ధ ఆలయాలు నది పరివాహకంలో ఉండటం గమనార్హం. కౌతాళం మండలం మేళిగనూరులో తుంగభద్ర నది జిల్లాలోకి ప్రవేశిస్తోంది. అక్కడ 124 గ్రామాలతోపాటు, మంత్రాలయం, కర్నూలు నగరం, గూడూరు మున్సిపాలిటీ పరిధిలో సుమారు 13.50 లక్షల మందికి తాగునీటి దాహార్తి తీరుస్తోంది. తుంగభద్ర ఎల్లెల్సీ ద్వారా 200 గ్రామాలకు తాగునీరు అందుతుంది.
సుంకేసుల జలాశయం
సుంకేసులతో...: తుంగభద్ర నదిపై ఆనకట్ట కట్టడానికి 1860లో సర్ ఆర్థర్ కాటన్ ప్రయత్నించారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఆ తర్వాత కాటన్ 1945 ఫిబ్రవరి 28న పునాది వేసి...1953 జులై 1 నాటికి రెండు తెలుగు రాష్ట్రాల్లోని కరవు జిల్లాలకు తుంగభద్ర నీళ్లు అందించారు. ఇలా ఇప్పటికే తుంగభద్ర నది నీటిని తాగడానికి, బీడు భూములు సస్యశ్యామలం చేయడానికి దోహదపడ్డాయనడంలో సందేహమే లేదు. సుంకేసుల వద్ద నదిపై జలాశయం ఏర్పాటు చేయడం, కేసీ కెనాల్ ద్వారా తుంగభద్ర నీటిని మళ్లింపుతో కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర జలాశయం నుంచి లో లెవల్, హై లెవల్, లఫె్ట్‌బాంక్ కెనాల్స్ నిర్మించి కర్నూలు, అనంతపురం జిల్లాలకు నీరు అందిస్తున్నారు. ఎల్లెల్సీ ద్వారా కర్నూలులో ఖరీఫ్, రబీ సీజన్‌లో 1.52 లక్షలు ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది.
కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్
- తుంగభద్ర పుష్కరాలకు సంబంధించి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. వీఐపీలకు సంబంధించిన ప్రోటోకాల్ సమాచారం, భక్తుల వసతులు తదితర వాటి కోసం 24 గంటల పాటు మూడు షిఫ్ట్‌లలో పనిచేసేలా అధికారులను నియమించామని డీఆర్వో పుల్లయ్య తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్ 12 రోజులపాటు కొనసాగనుంది. ఒక్కో షిప్ట్‌కు తహసీల్దారు, ఉప తహసీల్దారు, ఎగువ లేదా దిగువశ్రేణి సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్ కలిపి మొత్తం ఐదుగురితో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఏ.వి. రమణి (90149 16994) జి.అంజన్‌బాబు (83339 89005) డి.ఎం. ప్రేమ్‌సాగర్ (85200 30288)లు అందుబాటులో ఉంటారని వివరించారు.
ఇదీ చదవండి: నేడు ప్రారంభం కానున్న పన్నెండేళ్ల పండగ