కర్నూలు జిల్లాలో పోతిరెడ్డిపాడు నుంచి అవుకు జలాశయం వరకు కాల్వ సామర్థ్యాన్ని 20 వేలు నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచటానికి రెండు భాగాలుగా పిలిచిన టెండర్లు దాదాపు ఖరారయ్యాయి. గోరుకల్లు నుంచి అవుకు వరకు లైనింగ్ పనులు, అవుకు 3వ టన్నెల్ పనుల విలువను 1269.49 కోట్లు రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల 23న జలవనరులశాఖ నిర్వహించిన బిడ్లో నాలుగు సంస్థలు పాల్గొన్నాయి. అందులో డీఎస్ఆర్ (జేవీ) 2.228శాతం ఎక్కువకు కోడ్ చేసి ఎల్-1గా నిలిచింది. దీనివల్ల చేపట్టాల్సిన పనుల విలువ 1297.78 కోట్ల రూపాయలకు చేరింది. ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రం ఖమ్మంకు చెందినదిగా తెలుస్తోంది. స్టేట్ లెవల్ టెక్నికల్ కమిటీ(ఎస్ఎల్టీసీ) ఆమోద ముద్ర రాగానే పనులకు ఒప్పందం జరగనుందని అధికారులు తెలిపారు.
మరోవైపు పోతిరెడ్డిపాడు నుంచి గోరుకల్లు వరకు 1061 కోట్ల రూపాయల విలువైన లైనింగ్ పనులకు గతంలో టెండర్ పిలిచినా ఎవరూ బిడ్ వేయలేదు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 12 వరకు ఆన్లైన్ రెండోసారి బిడ్లో పాల్గొనే అవకాశం కల్పించారు.