Farmers difficulties: పండించిన పంటలకు ధరలు లేక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పండించిన పంటలు అమ్మితే కనీసం కూలీలకు వెచ్చించిన ఖర్చులు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని ఉల్లి, టమాట రైతులు గిట్టుబాట ధర లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులను తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి పరామర్శించారు. ఉల్లి, టమాట పంటలకు ధర లేక అప్పుల పాలైనట్లు రైతులు గోడు వెలిబుచ్చారు. పంట పండించటానికి పెట్టుబడి ఖర్చులు, రైతు కూలీల ఖర్చులు, మార్కెట్‌కు తరలించడానికి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతుండగా.. అమ్మితే కూలీలకు వెచ్చించిన నగదు కూడా తిరిగి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు రైతు భరోసా, పావలా వడ్డీ రుణాలు కాదని.. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని రైతులు కోరారు.
రైతులు వేల రూపాయలు ఖర్చు చేసి పండించిన పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడంలో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. కూలీలకు గిట్టుబాటు ధర లేక కొట్టుమిట్టాడుతుంటే.. సీఎం మాత్రం రైతులు ఆనందంగా ఉన్నారని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేకతను అడ్డుకోలేక పనికిమాలిన పనులు చేస్తున్నారని అన్నారు. ప్రజలను పట్టించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును కుప్పంలో వైకాపా శ్రేణులు అడ్డుకోవడం, అన్న క్యాంటీన్‌ను ధ్వంసం చేయడం దారుణమని అన్నారు.
ఇవీ చూడండి: