కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలోని తెదేపా నాయకులను తీసుకెళ్లి పోలీసులు నిర్బంధించటం దారుణమని ఆ పార్టీ నేత తిక్కారెడ్డి ఆరోపించారు. వైకాపా అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. తమ పార్టీ నేతలను, కార్యకర్తలను వెంటనే విడుదల చేయకుంటే పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఆదోని పరిధిలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు ఏకపక్షంగా జరుగుతున్నాయని తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు. తమ నాయకులను అక్రమంగా అరెస్టు చేశారని, మరికొంత మందిని గృహ నిర్బంధం చేశారని ధ్వజమెత్తారు. అల్లర్లు సృష్టిస్తారని.. ప్రతిపక్షం నాయకులను బంధిస్తున్నామని చెప్పటం సరికాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగకుండా వైకాపా దౌర్జన్యాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని ఎస్ఈసీకి విజ్ఞప్తి చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో నాలుగవ విడత పంచాయతీ ఎన్నికలు ప్రారంభం