Water problem: కర్నూలు జిల్లాలో ఏర్పాటైన ఓ భారీ పరిశ్రమకు మౌలిక సదుపాయాల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం చూపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కర్నూలు జిల్లా తంగడంచెలో 623 ఎకరాలు జైన్ ఇరిగేషన్ సిస్టమ్ పరిశ్రమకు కేటాయించారు. తొలుత రూ.340 కోట్లతో పైపులు, డ్రిప్ పైపుల తయారీతో పాటు పండ్ల ప్రొసెసింగ్ ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా ముచ్చుమర్రి నుంచి తంగడంచె వరకు 17 కి.మీ. పైపులైను ద్వారా నీటి సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
తంగడంచెను సీడ్ హబ్‌గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో, సీడ్ హబ్, జైన్ ఇరిగేషన్‌కు కలిపి నీటి సౌకర్యం కల్పించేలా రూ.18 కోట్లతో 2017-18లో మొదట డీపీఆర్ సిద్ధం చేశారు. తర్వాత జైన్ ఇరిగేషన్ పరిశ్రమకు ఒక్కదానికే రూ.7 కోట్లతో డీపీఆర్ తయారు చేశారు. అవసరమైన పైపుల సరఫరాకు జైన్ ఇరిగేషన్ ముందుకు రాగా, పంపుహౌస్, మోటార్లకు రూ.3 కోట్లు స్టేట్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ ద్వారా ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో నీటి సౌకర్యం కల్పన కలగా మారింది.
సంస్థ ప్రతినిధులు ప్రస్తుత ప్రభుత్వానికి, ఏపీఐఐసీ, జిల్లా అధికారులకు కంపెనీ ప్రతినిధులు అర్జీలు సమర్పిస్తూనే ఉన్నారు. నిత్యం 3 క్యూసెక్కుల నీరు అవసరమని, నీటి సౌకర్యం కల్పిస్తే 8 నెలల్లో ఉత్పత్తి ప్రారంభిస్తామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. పైగా ఎప్పుడు నీరు ప్రవహిస్తుందో తెలియని కేసీ కెనాల్ ద్వారా తాత్కాలికంగా నీటిని ఉపయోగించుకోవాలని చెప్పి చేతులు దులుపుకొంది.
అయితే కేసీ కెనాల్ నుంచి తీసుకునే నీరు కేవలం రైతులకు డ్రిప్‌పై అవగాహన కల్పించడం కోసం పెంచుతున్న పండ్ల మొక్కలకు మాత్రమే సరిపోతున్నాయని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. పైపుల తయారీకి నిత్యం కోటి లీటర్ల నీరు అవసరం ఉండగా, శాశ్వత పరిష్కారం లేక పరిశ్రమ ఉనికి ప్రశ్నార్థకమైంది.
3500 మంది ఉపాధికి దెబ్బ.. నీటి సౌకర్యం కల్పిస్తారన్న ఆలోచనతో పండ్ల ప్రొసెసింగ్ దృష్టిలో పెట్టుకొని జైన్ ఇరిగేషన్ సంస్థ రైతులకు సబ్సిడీపై మామిడి, ఇతర పండ్ల మొక్కలు అందజేసింది. నీటి సరఫరా లేకపోవడంతో పరిశ్రమను ప్రారంభించలేదు. ఇది మొదలైతే రూ. 800 కోట్లతో పూర్తిస్థాయిలో దీన్ని విస్తరించే ప్రణాళిక ఉన్నప్పటికీ అందుకు తగ్గ సహకారం ప్రభుత్వం నుంచి అందని పరిస్థితి నెలకొంది. ఇది అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా 3,500 మందికి, పరోక్షంగా 10,000 మందికి ఉపాధి కలుగుతుంది.
భూమి సేల్ డీడ్ చేయకుండా.. తంగడంచె సీడ్‌హబ్‌లో మొత్తం 1600 ఎకరాలుండగా, అందులో 623 ఎకరాలు 2017లో జైన్ ఇరిగేషన్‌కు కేటాయించారు. ఈ భూములను లీజుకు కాకుండా, కొనుక్కోవాలని ప్రభుత్వం చెప్పడంతో ఎకరా రూ.5 లక్షల చొప్పున రూ. 31.15 కోట్లు సంస్థ చెల్లించింది. అప్పట్లో 372 ఎకరాలకు సేల్ డీడ్ చేయగా, మిగిలిన 251 ఎకరాలు సేల్‌డీడ్ చేయకుండా తాత్సారం చేస్తున్నారు.