కర్నూలు నగరపాలక సంస్థకు 11 ఏళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించుకున్నాయి. 1994లో నగరపాలక సంస్థగా ఏర్పడ్డాక... మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగాయి. మొదటిసారి తెదేపా, రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ మేయర్ స్థానాలను కైవసం చేసుకున్నాయి.
నగర పాలక వర్గం గడువు 2010లో ముగిసింది. నాటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. గతేడాది మార్చిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో నిరవధికంగా వాయిదాపడ్డాయి. ప్రస్తుతం వైరస్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో... ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది.
వైకాపా
అధికార వైకాపా.. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో అన్ని శాసనసభ, పార్లమెంటు స్థానాలు గెలుపొంది... తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ సత్తా చాటామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నారు. కర్నూలు నగరంలోనూ పాగా వేసేందుకు ఆ పార్టీ మేయర్ అభ్యర్థి బీవై రామయ్య సహా నాయకులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తెదేపా
రెండు పర్యాయాలు కర్నూలు పీఠాన్ని కోల్పోయిన తెదేపా ఈసారైనా గెలిచితీరాలని... ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని భావిస్తోంది. సర్కారు వైఫల్యాలను చెబుతూ... గతంలో రూ.800 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళుతోంది.
ఇతర పార్టీలు
ప్రధాన పార్టీలు సహా భాజపా, జనసేన, వామపక్ష పార్టీలు సైతం తమ బలాన్ని చాటుకునేందుకు రంగంలోకి దిగాయి. తమశక్తిమేరకు ప్రచారంలో పాల్గొంటున్నాయి. స్థానిక సంస్థలకు కేంద్రమే నిధులు మంజూరు చేస్తుందని భాజపా నాయకులు చెబుతుండగా... కనీస మౌలిక వసతులు కావాలంటే తమనే గెలిపించాలని సీపీఎం కోరుతోంది.
కర్నూలు నగరంలో 52 వార్డులు ఉన్నాయి. 4,50,561 మంది ఓటర్లున్నారు. కందనవోలు ప్రజలు మేయర్ కుర్చీని ఏ పార్టీకి అప్పగిస్తారో వేచి చూడాలి.
ఇదీ చదవండి