Temperature Raise In AP : ఎండలు బాబోయ్.. ఎండలు.. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పూర్తిగా పొడి వాతావరణం నెలకొంది. ఉష్ణ గాలుల ప్రభావంతో రాష్ట్రంలో అన్ని చోట్లా సాధారణం కంటే 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మహారాష్ట్రలోని విదర్భ నుంచి కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడిందని, సముద్ర మట్టానికి 1 కిలో మీటరు ఎత్తులో ద్రోణి కొనసాగుతుందని, రాగల రెండు, మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు, కొన్నిచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
శుక్రవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు : చిత్తూరు 43.84 డిగ్రీలు, తాడేపల్లి గూడెం 43.3, ప్రకాశం జిల్లా 43.1, ధవళేశ్వరం 43, నంద్యాల 43, తిరుపతి 42.7, పశ్చిమ గోదావరి జిల్లా 42.5, సిద్ధవటం 42.42, ఎన్టీఆర్ 42.35, నెల్లూరు 42.33, కోనసీమ జిల్లా 42, మంత్రాలయం 42, ఏలూరు 41.85, కర్నూలు 41.75, విజయవాడ 40.3, తిరుపతి 40.8, కడప 42.7 గా నమోదు అయ్యాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ద్విచక్ర వాహనంలో మంటలు : కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రయాణిస్తున్న ఓ ద్విచక్ర వాహనం ఇంజన్లో వేడికి మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో వెంటనే ద్విచక్ర వాహనాన్ని నిలిపివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పక్కనే చలివేంద్రం ఉండడంతో చలివేంద్ర నిర్వాహకుడు ద్విచక్ర వాహనంపై నీళ్లు చల్లి మంటలు అదుపు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు.
జాగ్రత్తలు తప్పనిసరి : ఈ సంవత్సరం మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవ్వడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బయట తిరుగకూడదని వెద్యులు చెబుతున్నారు. వృద్ధులు, పిల్లలు, మహిళలపై ఈ ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడ దెబ్బ తగలే అవకాశం కూడా ఉందని అంటున్నారు. వీటితో పాటు చర్మ వ్యాధులు తలెత్తే అవకాశం కూడా ఉంది.
మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4వరకు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో తప్పితే బయటకు వెళ్లకూడదని.. వెళ్లాల్సిన పరిస్థితి వస్తే గొడుగుతో పాటు మజ్టిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, గ్లూకోజ్ నీళ్లు వెంట తీసుకెళ్లాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
ఇవీ చదవండి