Family protest at Dhone DSP office:కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీ ఎన్నికల్లో తన భర్త తెదేపాకు మద్దతు తెలిపారనే అక్కసుతో పోలీసులు అరెస్టు చేశారని, వెంటనే విడుదల చేయాలని ఇద్దరు కుమారులు, అత్తతో కలిసి బాధితుడి భార్య సృజన శనివారం డోన్ డీఎస్పీ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ‘పట్టణానికి చెందిన బొంతల మధుసూదన్‌శెట్టి ఇటీవల జరిగిన నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా తరఫున పని చేశారు. ఆ కారణంతో ఈనెల 14న బుగ్గానిపల్లెకు చెందిన పిట్టల మధును కర్రతో దాడి చేసి గాయపర్చినట్లు బేతంచెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. దాంతో మనస్తాపం చెందిన ఆయన 22న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ 3 రోజులు చికిత్స పొందారు. శుక్రవారం పోలీసులు అతడిని అరెస్టుచేసి తీసుకెళ్లారు’ అని బాధితురాలు వాపోయారు. ఇంటికెళ్లి మందులు వేసుకుని వస్తానని చెప్పినా వినకుండా బలవంతంగా లాక్కెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఎస్సై శ్రీనివాసులు మాట్లాడుతూ... మధుసూదన్‌శెట్టిని కోర్టులో హాజరుపరచగా జడ్జి బెయిలు మంజూరు చేయడంతో ఇంటికి పంపించామని తెలిపారు.
‘నన్ను చంపేందుకు కుట్ర పన్నారు’
కర్నూలు సచివాలయం: ‘సారూ.. నన్ను చంపేస్తామని అంటున్నారు.. మీరే కాపాడండి’ అని బాధితుడు మధుసూదన్‌శెట్టి కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డికి విన్నవించారు. బెయిలుపై విడుదలైన ఆయన కుటుంబ సభ్యులతో కలిసి శనివారం రాత్రి కర్నూలులో పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు వెంకటేశ్వర్లును కలిశారు. అక్కడే మీడియాతో మాట్లాడారు. ‘ఈనెల 13న నేను మద్యం తాగా.. ఆ మైకంలో ఏం తిట్టానో నాకైతే మతికి లేదు. మరుసటి రోజు నాపై కేసులు పెట్టారు. కొందరు నన్ను చంపుతామని బెదిరిస్తే పురుగులమందు తాగేశా. పోలీసు స్టేషన్‌లో ఎస్సై ముందే... వైకాపా నాయకుడు బాబుల్‌రెడ్డి పిలిపించి నన్ను కొట్టించారు. తర్వాత పోలీసుస్టేషన్‌కి తరలించారు. చివరికి బెయిలుపై బయటకొచ్చా. నన్ను మీరే కాపాడాలి’ అని విన్నవించారు.
ఇదీ చదవండి:
Accident: కొవ్వూరు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి ఢీకొన్న 6 లారీలు