సర్కారీ దవాఖానకు వెళ్లాలంటేనే భయపడతారు కొందరు. ఇక అక్కడ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అంటే పరేషాన్ అవుతారు. కడుపులోనే కత్తెరలు వదిలేసిన సందర్భాలు... వైద్యుల నిర్లక్ష్యంతోనే తల్లీబిడ్డలు అవస్థలు పడ్డారు... వంటి వార్తలు వింటూనే ఉంటాం. కానీ ఆ ఆసుపత్రికి వెళితే మాత్రం కార్పొరేట్‌ను తలదన్నే స్థాయిలో ఆపరేషన్లు చేస్తారు అక్కడ!
ఎమ్మిగనూరు రాష్ట్రంలోనే ప్రథమం...
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఇటీవలై అరుదైన రికార్డు దక్కింది. రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు చేయడంలో ఆ ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచింది. వైద్యులు, సిబ్బంది కొరత ఉన్నప్పటికీ... కాన్పుల్లో ముందు వరుసలో ఉంది. 50 పడకల ఆసుపత్రిలో నెలకు 60 ప్రసవాలు జరగాల్సి ఉండగా 250 కాన్పులు జరుగుతున్నాయి. గైనకాలజిస్ట్ ఒకరే ఉన్నప్పటికీ.. రికార్డు స్థాయిలో ప్రసవాలు జరుగుతున్నాయి.
మంత్రాలయం నుంచీ ఇక్కడికే...
కాన్పుల కోసం గర్భిణులు ఎమ్మిగనూరుతోపాటు మంత్రాలయం నియోజకవర్గం నుంచి సైతం ఈ ఆసుపత్రికే వస్తారు. ప్రసవాల కోసం సౌకర్యాలు పెంచేందుకు ప్రభుత్వం యూనిసెఫ్‌తో జత కట్టింది. తొలిసారిగా రాష్ట్రంలో ఇక్కడే రెండు కోట్లతో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పనకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. ఆదర్శ కాన్పుల వార్డు అందుబాటులోకి వస్తే మాత శిశువులకు మరింత సౌకర్యంగా ఉంటుంది.
కుటుంబ నియంత్రణకు కేరాఫ్‌గా మారింది ఎమ్మిగనూరు ఆసుపత్రి. రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. సౌకర్యాలు లేకున్నా... సిబ్బంది కొరత వేధిస్తున్నా... లక్ష్యం ముందు అన్నీ దిగదుడపే అని నిరూపించింది.
ఇదీ చదవండీ: శింగనమలలో ధన పిశాచి.. ఆ మాంత్రికుడు ఏం చేశాడంటే!