కర్నూలు జిల్లా కల్లూరు మండల పరిధిలోని శివారు రింగ్ రోడ్డు వద్ద కరోనా మృతుల అంత్యక్రియలకు శ్మశానవాటికను ఏర్పాటు చేయవద్దంటూ లక్ష్మీపురం గ్రామ పెద్దలు కోరారు. శ్మశాన వాటిక ఎగువ భాగంలో ప్రజా నగర్ కాలనీ, ఏపీ టిడ్కో హౌసింగ్ ఇళ్లు (10 వేల గృహాలు), కింద భాగంలో రాగమయూరి కాలనీలు ఉన్నాయి. జనవాసాలు ఉండే ప్రాంతానికి సమీపంలో ఏర్పాటు చేస్తే ఎలా అంటూ లక్ష్మీపురం గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. వాటర్ షెడ్ వద్ద ఉండడం వల్ల వర్షాకాలంలో శవాలు కొట్టుకొచ్చే అవకాశం ఉందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ అంశంపై రాగ మయూరి కాలనీ వాసులతో సమావేశమయ్యారు. శ్మశాన వాటిక వద్ద వినియోగించి పారేసిన పీపీఈ కిట్ల(దుస్తులు) కనిపించడం వల్ల గ్రామ పెద్దలు మండి పడుతున్నారు. పీపీఈ కిట్లను చెట్లమల్లాపురం సమీపంలోని బయో వేస్టేజ్‌లో నిర్వీర్యం చేయాల్సి ఉండగా బహిరంగంగా పారవేయడంపై ఆగ్రహించి ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆ ప్రాంతాన్ని పరిశీలించి కల్లూరు తహసీల్దారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కలెక్టర్ జి.వీరపాండియన్‌ను కలిసి శ్మశానవాటిక ఏర్పాటు చేయవద్దని విన్నవించారు.
ఇదీ చదవండి :