రాష్ట్ర ప్రజల మనోభావాలతో ముఖ్యమంత్రి జగన్ ఆటలాడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. తితిదే డిక్లరేషన్‌పై వైకాపా రాద్ధాంతం చేసిందన్న చంద్రబాబు.... హైందవ సంప్రదాయం ప్రకారం డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. నంద్యాల తెదేపా నేతలతో బుధవారం వర్చువల్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు.... వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు.
ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని భ్రష్టు పటిస్తున్నారు. ఆలయాల ప్రతిష్ఠ దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. భార్య ఉన్నపుడు భర్త మాత్రమే ఆలయ పూజల్లో పాల్గొనడం రాష్ట్రానికే అరిష్టం. జగన్‌కు ఏసుక్రీస్తుపై నమ్మకం ఉన్నందునే ఇంటిపై శిలువ చిహ్నం వేసుకున్నారు. అలాగే ఇతరుల నమ్మకాన్ని గౌరవించాలే తప్ప హేళన చేయడం తగదు. 5 శాతం ఓట్ల మార్పుతో వైకాపా అధికారంలోకి వచ్చింది. మరో 5 శాతం ఓట్లు తెదేపాకు వస్తే వైకాపా అధికారంలోకి వచ్చేది కాదు- చంద్రబాబు, తెదేపా అధినేత