నిండు గర్భిణి మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో విసిరేసిన ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. నిందితులపై కేసులు నమోదు చేశారు.
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో గత శుక్రవారం లావణ్య అనే గర్భిణి కాన్పు సమయంలో మృతి చెందింది. మృతదేహాన్ని ఆమె అత్త గారి ఊరైన రుద్రవరం మండలం బి.నాగిరెడ్డిపల్లికి తీసుకొచ్చారు. నిండు గర్భిణి మృతదేహాన్ని పూడిస్తే... గ్రామానికి కీడు జరుగుతుందని కొందరు అంత్యక్రియలను అడ్డుకున్నారు. అనంతరం లావణ్య మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకు కట్టివేసి వదిలివేశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించటంతో సోమవారం ఐసీడీఎస్పీడీ భాగ్య రేఖ, సీఐ చంద్రబాబు, ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి... లావణ్య బంధువుల సాయంతో మృతదేహాన్ని పరిశీలించారు. తెలుగు గంగ ప్రధాన కాలవలు దాటి అవతలివైపు నల్లమల అటవీ ప్రాంతంలో ఒక చెట్టుకు కట్టివేసి ఉన్న మృత దేహాన్ని గుర్తించి శవ పరీక్షలు నిర్వహించి ఖననం చేశారు.
ఇలాంటి అమానవీయ ఘటన జరగటం బాధాకరమని ఐసీడీఎస్ పీడీ భాగ్యరేఖ అన్నారు. మూఢ నమ్మకాలను వదిలి వేయాలని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. ఈ ఘటనలో లావణ్య భర్త బంధువులను నిందితులుగా గుర్తించామని సీఐ చంద్రబాబు నాయుడు తెలిపారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు.