కర్నూలు జిల్లాలో లాక్ డౌన్ పూర్తిస్థాయిలో అమలు కావటం లేదు. ప్రజలు నిత్యావసర సరకుల పేరిట రహదారులపై యథేచ్ఛగా తిరుగుతున్నారు. ప్రజలు సైతం సామాజిక దూరాన్ని పాటించి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదవగా.. అధికారులందరూ అప్రమత్తమయ్యారు.
గుర్తించారు కానీ.. అరకొరగా వసతులు
జిల్లా వ్యాప్తంగా ఈనెల 25వ తేదీ వరకు విదేశాల నుంచి వచ్చినవారు 896 మందిగా అధికారులు గుర్తించారు. వీరిలో 766 మంది హోం ఇసోలేషన్‌లో ఉన్నారు. 130 మంది హోం ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నారు. అనుమానిత కేసులు 21 వరకు ఉండగా శనివారం ఓ పాజిటివ్ కేసును గుర్తించారు.
జిల్లాలో ఉన్న 87 పీహెచ్‌సీల్లో కరోనాకు సంబంధించి ప్రాథమిక పరీక్షలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పరీక్షలు చేసే వైద్యులకుగానీ, నర్సింగ్ సిబ్బందికి అవసరమైన ఎన్ 95 మాస్కులు అందుబాటులో లేవు. పలు ప్రాంతాల్లో తరచూ చేతులు శుభ్రం చేసుకొనేందుకు శానిటైజర్లు లేవు. రక్షణ పరికరాల విషయంలో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారన్న విమర్శలున్నాయి. మరోవైపు పీహెచ్‌సీల పరిధిలో అనుమానిత కేసులుంటే వారిని ప్రత్యేక వాహనాల్లో క్వారంటైన్లకు తరలించాల్సి ఉంది. వాహనాలు సైతం అంతంతమాత్రంగానే అందుబాటులో ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయి.
మరిన్ని వెంటిలేటర్లు అవసరం
కర్నూలు సర్వజన వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో అవసరమైనమేర వెంటిలేటర్లు లేవు. ఉన్నతాధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
ఉన్నంతవరకు అందుబాటులో ఉంచాం
సర్వజన వైద్యశాలతోపాటు పీహెచ్‌సీలకు కావాల్సిన మాస్కులు, శానిటైజర్లను ఉన్నంతవరకు పంపించామని డీఎంహెచ్‌వో చెప్పారు. ప్రభుత్వం సైతం అవసరమైన వస్తువులు సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఇదీ చూడండి: