నేషనల్ వాటర్ మిషన్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్తా చాటింది. సాగు, తాగునీటి నిర్వహణలోని కీలక విభాగాల్లో నాలుగు జాతీయ పురస్కారాలను సొంతం చేసుకుంది. విజ్ఞాన్ భవన్లో 24వ తేదీ నుంచి వారం రోజుల పాటు జరుగుతున్న ఇండియా వాటర్ వీక్- 2019 కార్యక్రమంలో భాగంగా కేంద్ర జల శక్తి శాఖ వివిధ విభాగాల్లో రాష్ట్రాలకు అవార్డులను ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్ నాలుగు అవార్డుల దక్కించుకోగా తెలంగాణ ప్రభుత్వాన్ని మూడు అవార్డులు వరించాయి. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, సహాయమంత్రి రతన్ లాల్ కటారియా చేతుల మీదుగా రాష్ట్ర నీటి పారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు సహా పలువురు అధికారులు అవార్డులను అందుకున్నారు.
నీటి సమాచారం ప్రజలకు అందుబాటులో ఉంచే విభాగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. జలవనరులపై వాతావరణ మార్పును అంచనా వేయటంలో ఏపీకి ద్వితీయ పురస్కారం రాగా, కర్నూలు జిల్లా మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టుకు ప్రభుత్వం అందించే నీటి వినియోగ విభాగంలో మూడో అవార్డు దక్కింది. నీటి నిర్వహణలో బేసిన్ లెవెల్ సమ్మిళిత విభాగంలో ఏపీ ప్రథమ స్థానం దక్కగా గుంటూరులోని కోకా కోలా కంపెనీకి నీటి వినియోగంలో అవార్డు దక్కింది. సాగునీటి అధికారుల సమన్వయ కృషితోనే జాతీయ అవార్డులు వచ్చాయని ఇంకా నీటి పారుదల శాఖలో ఎలాంటి మార్పులు తీసుకురావాలో దృష్టి పెడతామని ఆ శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు.