శాసన మండలిలో ఇతర పార్టీల నుంచి వచ్చే సభ్యులతో బలం పెరిగిన తర్వాత ప్రస్తుత ఛైర్మన్‌ను అవిశ్వాస తీర్మానంతో తొలగించాలని వ్యూహాం పన్నుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైకాపా సభ్యుడిని ఛైర్మన్‌గా చేయాలని ఆశతో వైకాపా ఉన్నట్లు తెలుస్తోంది. శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అడ్వొకేట్ జనరల్ ఎస్. శ్రీరామ్ ముఖ్యమంత్రి జగన్‌తో తాడేపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ నెల 27 తేదీన శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి రద్దుకు నిర్ణయం తీసుకోవాలా.. లేక మెజారిటీ వస్తే కొనసాగించటమా అన్న అంశంపై ప్రభుత్వం లోతుగా చర్చించినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును గట్టెక్కించుకోకపోతే మండలిని రద్దు చేయాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ప్రతిపక్ష ఎమ్మెల్సీలు ఆత్మరక్షణలో పడినట్టు పార్టీ భావిస్తోంది. వారంతా తమవైపే మొగ్గుతారనే ప్రచారం జరుగుతోంది. అనుకున్నంత మంది ఎమ్మెల్సీలు మళ్లితే శాసనమండలి రద్దు ప్రతిపాదన వాయిదా వేసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
తమ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలతో అధికార పార్టీకి చెందిన ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారని, డబ్బు, పదవులు ఎర వేస్తున్నారని తెదేపా ఆరోపిస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక తెదేపా ఎమ్మెల్సీతో వైకాపా నేతలు మాట్లాడారని వార్తలు తెలుస్తున్నాయి. పార్టీలోకి వస్తే రూ. 5 కోట్ల నగదు, మండలిలో ప్రభుత్వ విప్ పదవి ... వచ్చే ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆయన కుటుంబానికి చెందిన వారికే అవకాశమిస్తామని చెప్పినట్టు తెదేపా వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనను తెదేపా ఎమ్మెల్సీ తిరస్కరించారని పేర్కొన్నాయి. మరోవైపు తమ ఎమ్మెల్సీలెవరూ జారిపోకుండా తెదేపా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. పార్టీ అధినేత చంద్రబాబు ...ఎమ్మెల్సీలతో స్వయంగా ఫోన్ లో మాట్లాడి, వారికి పార్టీ అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిందేమీ లేదని ధైర్యం చెప్పారు. ఎమ్మెల్సీలతో నిరంతరం మాట్లాడి, పార్టీ వెంట
నిలబడేలా చూసే బాధ్యతను శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు, శాసనసభలో తెదేపాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడులకు అప్పగించారు.
నేడు తెదేపా సమావేశం
భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు నేడు పార్టీ జాతీయ కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే తమ ఎమ్మెల్సీల్లో ఒకరు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి సభకు రాకపోవడం, మరో ఇద్దరు అధికారపక్షానికి మద్దతు ప్రకటించటంతో తెదేపా అప్రమత్తమైంది. తెదేపా శాసనసభాపక్ష సమావేశానికి వ్యక్తిగత కారణాలతో నలుగురు ఎమ్మెల్సీలు హాజరవడం లేదని సమాచారం. కేఈ ప్రభాకర్, సరస్వతి, తిప్పేస్వామి సమావేశానికి తాము హాజరుకాలేమని పార్టీ నాయకత్వానికి ఇప్పటికే చెప్పారు. శత్రుచర్ల విజయరామరాజు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉన్నారు. మిగతా ఎమ్మెల్సీలంతా సమావేశానికి హాజరవుతామని చెప్పారని తెదేపా వర్గాలు వెల్లడించాయి.
ఇదీచూడండి.'మండలిని రద్దు చేస్తే అర్థవంతమైన చర్చలకు ఆస్కారం లేదు'