కథ... కేవలం కాలక్షేపం కోసం చెప్పుకునేది కాదు. ఎన్నో భావాలు, మరెన్నో భావోద్వేగాలను ఎదుటి వ్యక్తికి అర్థమయ్యే విధంగా చెప్పగలిగే శక్తి కథకి ఉంటుంది. అందుకే ఆ మార్గాన్ని ఎంచుకుంది విజయవాడకు చెందిన స్నేహ చిన్మయ్. బీటెక్ చేసి డిజిటల్ మీడియా కన్సల్టెంట్గా విధులు నిర్వహిస్తోంది. అయినా కథలంటే మక్కువ. తన కథలతో చిన్నారులను ఆలోచింపజేయాలనే తపన. అందుకే స్టోరీ టెల్లింగ్ రంగంలో అడుగు పెట్టింది.
చిన్నారులు ఆలోచించేలా..
సమయం ఉన్నప్పుడూ చిన్న పిల్లలకు కథలు చెబుతోంది స్నేహ. యాంత్రిక జీవితంలో మర్చిపోయిన విలువల్ని పిల్లలకు నేర్పుతోంది. చిన్నారుల మనసును తాకే కథలు చెబుతూ వారిని ఆలోచింపజేస్తోంది. మన చుట్టూ ఉన్న వాటితో అప్పటికప్పుడు కథలు చెప్పేలా పిల్లలకు శిక్షణ ఇస్తే వాళ్ల మెదడు చురుక్కా పని చేస్తుందంటోంది. అలాగే పిల్లలు చెప్పే కథలను బట్టి వాళ్ల మానసిక స్థితి, ఆలోచనా విధానాలను సైతం అంచనా వేయవచ్చని ఈ రంగంలో కాలు పెట్టానని తెలిపింది.