విజయవాడ వైకాపా రాష్ట్ర కార్యాలయంలో వైకాపా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. వల్లభనేని వంశీపై నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో 100 చెరువులుంటే ఒక్కదాన్నీ వదలకుండా మట్టి తవ్వి అక్రమంగా ఆర్జించారని యార్లగడ్డ విమర్శలు చేశారు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలో ఈ ఐదేళ్లలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. తానెవరో తెలియకపోయినా రెండు కేసుల్లో సాయం చేశానంటూ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 2008లో తనపై కేసు నమోదైందని....ఆ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే వంశీ చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు.
రాజకీయాల్లో ఎన్నికల సమయంలో ప్రత్యర్థులు మరొకరి ఇంటికి వెళ్లే సంస్కృతి లేదన్న యార్లగడ్డ....తేనీటి విందుకు ఇంటికి రమ్మని ఆహ్వానించడం ద్వారా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో వంశీపై పోటీ చేసిన లగడపాటి, దుట్టా రామచంద్రరావును సైతం ఇలాగే తేనీటి విందుకు ఆహ్వానించారా అంటూ ప్రశ్నించారు.
వంశీతో సన్మానం చేయించుకోవాల్సిన అవసరం తనకు లేదని....23న ప్రజలే నిర్ణయిస్తారన్నారు. బెంగుళూరులో జగన్ మోహన్ రెడ్డిని వంశీ దంపతులు ఎందుకు కలిశారో చెప్పాలని యార్లగడ్డ డిమాండ్ చేశారు. తెలంగాణలో 500 కోట్లు విలువ చేసే ఆస్తులను వదిలేశానని చెబుతున్న వంశీ.....నియోజకవర్గంలో ఒక్కో లారీ చెరువు మట్టిని వెయ్యి రూపాయల చొప్పున ఎందుకు అమ్ముకుంటున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు.