కరోనా మహమ్మారి విజృంభనతో దేశవ్యాప్తంగా రైలు సర్వీసులను రైల్వే శాఖ ఆరు నెలల క్రితమే నిలిపివేసింది. రైల్వేశాఖ ముఖ్యమైన ప్రాంతాలకు 230 రైళ్లు మాత్రమే నడుపుతోంది. అయితే విపత్కర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున గూడ్స్ రైళ్లను నడుపూతూ విశేష సేవలందిస్తోంది. ఈ క్రమంలో గూడ్స్ రవాణాను మరింత పెంచి... నష్టాలను కొంతమేరకైనా పూడ్చుకోవాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
సరకు రవాణా బోగీలు ఉన్నా... అధిక సామర్థ్యం ఉన్న ఇంజిన్ల కొరత ఉంది. దీనివల్ల ప్యాసింజర్ రైలింజిన్ల బోగీలను తాత్కాలికంగా గూడ్స్ రైలింజన్గా మార్చే ప్రయత్నాలు చేయాలని అన్ని డివిజన్లకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు విజయవాడ రైల్వే డివిజన్ అధికారులు నెలక్రితం కసరత్తు ప్రారంభించారు. మేథస్సును వినియోగించి కేవలం 25 రోజుల్లోనే అధునాతన గూడ్స్ రైలింజన్ను రూపొందించారు.
తక్కువ ఖర్చుతో అద్భుతం
ప్యాసింజర్ రైలింజిన్ను అత్యధిక సామర్థ్యం కల్గిన ఇంజిన్లుగా మార్చాలంటే చాలా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. విజయవాడలోని ఎలక్ట్రిక్ లోకో షెడ్ అధికారులు, సిబ్బంది వినూత్న ఆలోచనను ఆచరణలోకి తెచ్చారు. అధునాతన టెక్నాలజీతో రెండు ప్యాసింజర్ రైలింజన్లను కలపాలని నిర్ణయించారు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా షెడ్లో నిలిచిపోయిన డబ్ల్యూఏపీ 4 ఇంజిన్లు సరకు రవాణాకు అనువుగా ఉంటాయని భావించారు. ఆ రకానికి చెందిన రెండు ఇంజిన్లను జత చేసి... విద్యుత్ కేబుళ్లను అనుసంధానించారు. డీఆర్ఎం శ్రీనివాస్ సహా లోకో షెడ్డు సీనియర్ సెక్షన్ ఇంజినీర్ పీవీఎస్ఆర్ ఆంజనేయులు పర్యవేక్షిస్తూ తగిన సూచనలు సలహాలు ఇచ్చారు.
25 రోజులపాటు కష్టపడి అత్యధిక సామర్థ్యం ఉన్న రైలింజన్ను సిద్ధం చేశారు విజయవాడ అధికారులు. అతి తక్కువ ఖర్చుతో గూడ్స్ రైలింజన్కు ఏ విషయంలోనూ తీసిపోని విధంగా దీనిని రూపొందించారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఈ రైలింజన్లను వినియోగంలోకి తీసుకువచ్చారు. అవసరం తీరాక ప్రయాణికుల రైలింజిన్లుగా తిరిగి మార్చుకునేలా వీటిని రూపొందించామని అధికారులు తెలిపారు.
కేంద్ర మంత్రి అభినందన
విజయవాడ ఎలక్ట్రిక్ లోకోషెడ్డు అధికారులు, సిబ్బంది విజయంపై రైల్వే మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. వారిని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇదే తరహాలో మరిన్ని రైలింజన్లు రూపొందించాలని నిర్ణయించారు. దేశంలోని మిగతా డివిజన్లవారు కూడా ఈ సాంకేతికతను వినియోగించి గూడ్స్ రైలింజిన్లను తయారు చేసే పనిలో పడ్డారు.