జాబితాలో పేర్లు తారుమారు..
విజయవాడ నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్షంతో ఓటరు జాబితాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. అనేకమంది పేర్లు ప్రస్తుతం డివిజన్ల నుంచి వేరే చోటుకు మారిపోయాయి. ఇది ప్రస్తుతం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. దీనిపై ఎన్నికల బరిలో ఉన్న పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఓటర్లు ఇతర డివిజన్ల జాబితాలో చేరిపోవడంతో ఆ ప్రభావం తమ గెలుపోటములపై ఉంటుందని ఆందోళన చెందుతున్నారు.
డివిజన్లు పెరిగినా..
నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన డివిజన్ల పునరుద్ధణలో భాగంగా 59 డివిజన్లను 64కు పెంచారు. ఆయా డివిజన్లలోని జనాభా, ఓటర్ల జాబితాల ఆధారంగా, నిర్దేశిత జనసాంద్రతను దృష్టిలో ఉంచుకుని పునర్విభజన చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో జాబితాలు తారుమారవడం, తప్పుల తడకగా మారడంతో సమస్యలు తప్పని పరిస్థితి నెలకొంది. ప్రధానంగా ఒక డివిజన్లో ఉండాల్సిన ఓటర్లను తీసుకెళ్లి మరో డివిజన్లో చేర్చడంపై పలువురు మండిపడుతున్నారు.
ఇక్కడిక్కడ ఇలా..
నగరంలోని 8వ డివిజన్ పరిధిలోని పలువురు పేర్లు 10, 11, 19 డివిజన్ల జాబితాలోకి వచ్చి చేరాయి. ఇలా దాదాపు 300 మందికి పైగా ఉన్నారని అంచనా. దీనిపై తెదేపా అభ్యర్థి చెన్నుపాటి ఉషారాణి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమ డివిజన్ ఓటర్లు ఎక్కడున్నారో తెలియక, వారిని ఎలా కలుసుకోవాలో తెలియక ఇబ్బందులు తప్పడంలేదని ఆవేదన చెందారు. దీనిపై ఆమె ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు.
* మరోవైపు 11వ డివిజన్లోని ఓటర్ల వివరాలు 4వ డివిజన్లోకి చేరగా, స్థానిక తెదేపా అభ్యర్థి జాస్తి సాంబశివరావు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
* ఏపీఐఐసీ కాలనీ పరిధిలోని అనేక ఓటర్ల వివరాలను 4వ డివిజన్లో చేర్చడంతో గందరగోళం ఏర్పడింది.
* వరలక్ష్మీనగర్, ఫిల్మ్‌నగర్, నెల్సన్‌మండేలా కాలనీ వంటి ప్రాంతాల్లోని ఓటర్ల వివరాలు 5వ డివిజన్లలోకి చేరాయంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు అందాయి.
* ప్రధానంగా తూర్పు నియోజకవర్గం పరిధిలోనే ఇలాంటివి ఎక్కువగా ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి:
రాజకీయాల అడ్డాలో ఒకప్పుడు ఆ పార్టీలు చక్రం తిప్పాయి.. మరి ఇప్పుడు..?