Traffic Jam Problems: 25 ఏళ్ల క్రితం నిర్మించిన విజయవాడ అజిత్‌సింగ్ నగర్ ఫ్లైఓవర్ మీదుగా ఉదయం, సాయంత్రం వేళల్లో.. వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఆ సమయాల్లో వాహనాల సంఖ్య భారీగా ఉంటుండటంతో.. కనీసం అరగంట ట్రాఫిక్‌లోనే నిలవాల్సిన పరిస్థితి వస్తోందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర పనులపై నగరంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలన్నా.. మరో మార్గం లేక సమయానికి గమ్యస్థానాలకు చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు.
నిత్యం రద్దీ కారణంగా.. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ వారధికి అనుబంధంగా డబుల్ ఫ్లైఓవర్ నిర్మించాలని కొన్ని ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నా.. పాలకులు పట్టించుకోవడం లేదని.. స్థానికులు నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అజిత్‌సింగ్ నగర్ ప్రాంతంలోని పలు వీధుల నుంచి.. నగరంలోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి సరైన రహదారి లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మధురానగర్, వాంబేకాలనీల్లో నిర్మించాల్సిన రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు పూర్తికాకపోవడంతో.. ఈ ప్రాంత ప్రజల రాకపోకలకు తిప్పలు తప్పడం లేదు. గతంలో అజిత్‌సింగ్ నగర్.. విజయవాడకు చివరి ప్రాంతంగా ఉండేది. ప్రస్తుతం నగరం విస్తరించడం వల్ల.. మధ్యలోకి వచ్చినట్లయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా రహదారుల విస్తరణ పనులు చేపట్టడంలో విజయవాడ నగరపాలక సంస్థ విఫలమైంది.
ఈ ప్రాంతంలోనే పలువురు ప్రజాప్రతినిధులూ నివాసముంటున్నా.. ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంపై దృష్టిసారించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఫ్లైఓవర్ పక్కనే మరో ఫ్లైఓవర్ నిర్మించి.. ట్రాఫిక్ రద్దీకి, ప్రమాదాలకు పరిష్కారం చూపాలని అజిత్‌సింగ్ నగర్ ప్రజలు కోరుతున్నారు.
"విజయవాడలో ఉన్న ట్రాఫిక్ ఒక ఎత్తయితే.. సింగినార్ ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ మరో ఎత్తు. ఈ ప్రాంతం నుంచి విజయవాడకు వెళ్లాలంటే ఒక ఊరు వెళ్లేందుకు పట్టేంత సమయం పడుతోంది. ఎప్పుడో 2000 సంవత్సరం లోపు నిర్మించిన ఒకే ఒక వంతెన మాత్రమే అక్కడ ఉంది. రెండు లక్షలకు మించిన ప్రజలు నివాసం ఉంటున్న సింగినార్ ప్రాంతంలో ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. బాంబే కాలనీ నుంచి మధురానగర్ వెళ్లేందుకు ఒక ఫ్రైఓవర్గానీ, అండర్ బ్రిడ్జికానీ నిర్మిస్తే.. సింగినార్ ప్రాంతంలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, మేయర్లు వంటి అధికారులంతా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నా దీనిపై దృష్టి పెట్టట్లేదు." - చింతల శ్రీనివాస్, అజిత్‌సింగ్ నగర్
"సింగినార్, పాయికాపురం, వాంబే కాలనీ, నున్న, నూజివీడు ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ఈ ప్రాంతం మీదుగా పోతుంటారు. బందర్‌రోడ్డు, ఏలూరు రోడ్డు, ఆటోనగర్ ప్రాంతాలవాసులు ఎక్కువగా ఈ ప్రాంతానికి వచ్చి కూలిపనులు, ఉద్యోగాలు చేసుకునేందుకు వస్తారు. కాగా.. ఈ ప్రాంతంలో ఒకే ఫ్లైఓవర్ రహదారి కావటంతో తీవ్రమైన ట్రాఫిక్ ఉంటోంది. ఈ ట్రాఫిక్‌లో చిక్కుకుని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. తరచుగా యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నా కూడా ఈ ప్రాంతంలో మరో ఫ్లై ఓవర్ నిర్మించాలనే అనే ఆలోచన అధికారులకు రాకపోవటం సిగ్గుచేటు. పైగా.. అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కట్టి సమస్యను పరిష్కారం చేయకపోగా.. ఈ రోజు ఆ ప్రాంతంలో కాలినడకన వెళ్లే వాళ్లకు రూ.500, సైకిల్‌పై వెళ్లేవారికి రూ.1,000 ఫైన్ వేస్తున్నారు. అవి చెల్లించకపోతే.. మూడు నెలల జైలు శిక్ష అని రైల్వే అధికారులు రోజువారీ కేసులు నమోదు చేస్తున్నారు." - కే. దుర్గారావు, అజిత్‌సింగ్ నగర్
ఇవీ చదవండి: