victim family allegation over Kodali Nani: గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని అండతోనే హత్య కేసులో నిందితులను అరెస్టు చేయట్లేదని బాధిత కుటుంబీకులు ఆరోపించారు. కృష్ణా జిల్లా శేరిదింటకుర్రులో గతంలో హత్యకు గురైన మేరిమ్మ కుటుంబసభ్యులు తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఏప్రిల్ 11న శేరిదింటకుర్రు గ్రామానికి చెందిన మేరిమ్మను అదే గ్రామానికి చెందిన వైకాపా సర్పంచ్ వర్గీయులు హత్య చేశారు. స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని ఈ అంశాన్ని పట్టించుకోకపోగా.. నిందితులకు అండగా ఉండి రక్షిస్తున్నారు. పోలీసులు సైతం కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు' అని మేరిమ్మ కుటుంబ సభ్యులు మండిపడ్డారు.
మేరిమ్మ హత్య ఘటనకు సంబందించిన ఆధారాలను చంద్రబాబుకు చూపించారు. సరిహద్దు విషయంలో మేరిమ్మకు వైకాపా సర్పంచ్ అదృష్టకుమారి కుటుంబసభ్యులతో గొడవ జరిగిందన్నారు. ఈ గొడవలో మేరిమ్మను సర్పంచ్ వర్గీయులు ఏడుగురు కలిసి హత్య చేస్తే.. ఇప్పటివరకూ ఇద్దరిని మాత్రమే అదుపులోకి తీసుకున్నారని చంద్రబాబుకు వివరించారు. మిగిలిన వాళ్లను వెంటనే అదుపులోకి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆయన్ను కోరారు. తాను అన్ని విధాలా అండగా ఉంటానని.. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై ఫిర్యాదు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
ఇదీచదవండి: