కృష్ణాజిల్లా గన్నవరంలో ఎన్నికల వేడి మండు వేసవిని తలపిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య తలెత్తిన వివాదం ఆ తర్వాత మాటల యుద్ధానికి దారితీసింది. ఈ మేరకు వైకాపా అభ్యర్థి యార్లగడ్డకు తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ మోహన్ పంపిన సంక్షిప్త సందేశం... అటు గన్నవరంతో పాటు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. పోలింగ్ రోజున కృష్ణాజిల్లా గన్నవరంలోని ప్రసాదంపాడు వద్ద... తెదేపా సిట్టింగ్ ఎమ్మెల్యే వంశీ మోహన్, వైకాపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. నాటి నుంచి ఇరు పక్షాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
యార్లగడ్డకు సందేశం పంపిన వంశీ...
వంశీమోహన్ వల్ల తనకు హాని ఉందని విజయవాడ పోలీస్ కమిషనర్‌కు యార్లగడ్డ వెంకటరావు ఫిర్యాదు చేశారు. దీనిపై తనదైన శైలిలో స్పందించిన వంశీ...నియోజకవర్గంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు చర్చించుకుందామని యార్లగడ్డకు సందేశం పంపించారు. తెదేపా చేసిన అభివృద్ధి, నియోజకవర్గంలో జరిగిన పనులు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు కృషి గురించే వ్యాఖ్యలు చేశాను తప్ప.. ఏనాడు వ్యక్తిగతంగా దూషించలేదని సందేశంలో పేర్కొన్నారు. అలాంటి తనపై నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు.
ఇరువురు మధ్య చర్చ జరుగుతుందో లేక ముందున్న పరిస్థితులే కొనసాగుతాయోనని గన్నవరం వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి: