రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌లో కీలకమైన టీకా రవాణా ప్రక్రియ ముగింపు దశకు చేరింది. తొలిదశలో ఈనెల 16న వైద్య, ఆరోగ్య సిబ్బందికి అందజేయనున్న వ్యాక్సిన్ డోసులు అన్ని జిల్లాలకు చేరాయి. సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్‌ల నుంచి కృష్ణా జిల్లా గన్నవరంలోని రాష్ట్రస్థాయి స్టోర్‌కు చేరిన టీకాలను పోలీసు బందోబస్తు మధ్య జిల్లాల్లోని వ్యాక్సిన్ కోల్డ్ రూమ్‌లకు తరలించారు. కరోనాపై పోరాటంలో ఫ్రంట్‌లైన్ వారియర్లుగా నిలిచిన,.... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులందరికీ ఈ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందజేయనున్నారు. ఒక్కొక్కరికీ 0.5 మిల్లీలీటర్ల డోస్ ఇస్తారు.
కర్నూలులో జిల్లాలో 40వేల 500 మంది కోవిడ్ యోధులకు అందించనున్న టీకాలను డీఎంహెచ్ఓ కార్యాలయంలోని నిల్వకేంద్రంలో భద్రపరిచారు. ఈనెల 16న ఆయా వ్యాక్సిన్ కేంద్రలకు వీటిని సరఫరా చేయనున్నారు. కడప జిల్లాలో తొలిదశ వ్యాక్సినేషన్‌కు 28వేల 500 మందికి అవసరమైన టీకాలు కడప వైద్యఆరోగ్యశాఖ కార్యాలయానికి చేరగా జిల్లాలోని 20 పంపిణీ కేంద్రాలకు వీటిని తరలించనున్నారు. అనంతపురం జిల్లాలో..... 29వేల మంది సిబ్బందికి టీకా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. చిత్తూరు జిల్లాలో అందించాల్సిన 41వేల 500 డోసులకు సరిపడినన్ని వ్యాక్సిన్ సీసాలను తరలించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో తగిన ఉష్ణోగ్రత మధ్య వీటిని భద్రపరిచారు.
జిల్లా కేంద్రాల నుంచి ఇప్పటికే క్షేత్రస్థాయికి టీకాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఒంగోలు నుంచి ప్రత్యేక వాహనంలో చీరాలకు తీసుకొచ్చి హెల్త్‌కేర్ సెంటర్‌లో భద్రపరిచారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా తర్వాత దశలో జర్నలిస్టులకు సైతం టీకాలు ఇవ్వనున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. గుంటూరు జిల్లాలో 31 కేంద్రాల ద్వారా తొలివిడత వ్యాక్సిన్‌ను 43వేల500 మందికి అందించనున్నారు. నెల్లూరు జిల్లాలో 38వేల 500 మంది కరొనా యోధులకు టీకాలు వేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 26వేల 500 మందికి టీకాలు అందిచేందుకు గానూ...2 వేల 650 కొవిడ్ వైల్స్‌ను క్షేత్రస్థాయికి తరలించారు.
తొలివిడత వ్యాక్సినేషన్ ప్రక్రియ ఈనెల 16 న మొదలై 20వరకూ సాగనుంది. ఒక్కో కేంద్రంలో రోజుకు వంద మందికి టీకా వేసేలా ఏర్పాట్లు చేశారు. మొదటి డోస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా 28 రోజుల తర్వాత మరో డోస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా 2 డోసులు పూర్తైన 14 రోజుల తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తవుతాయి. రెండో విడతలోపోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, పంచాయతీ, రెవెన్యూ సిబ్బందికి వ్యాక్సిన్ అందజేస్తారు. వీరంతా ఈనెల 25లోపు 'కొవిన్' సాప్ట్‌వేర్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మూడో దశలో 50 ఏళ్ల వయసు దాటినవారికి, 50 ఏళ్ల లోపు వయసున్న గుండె, కిడ్నీ మార్పిడి రోగులకు వ్యాక్సిన్ పంపిణీలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆ తర్వాత 18 ఏళ్లు నిండిన సాధారణ పౌరులందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇవీ చదవండి