నష్టమే తప్ప లాభాలు లేక పసుపు రైతు కష్టాలు పడుతున్నాడు. ఎంత కష్టపడి పంట పండించినా, రూపాయి మిగలటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఏటికేడు భూమి కౌలు పెరుగుతున్నా, సాగు ఖర్చులు ఎక్కువవుతున్నా, నమ్ముకున్న నేల ఆదుకుంటుందనే ఆశతో పసుపు పంట సాగు చేస్తున్నా, చివరికి కన్నీళ్లే మిగులుతున్నాయని కృష్ణా జిల్లా జగ్గయపేట నియోజకవర్గంలోని గ్రామాల రైతులు వాపోతున్నారు.
పోచంపల్లి, గౌరవరం, మక్కపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు, వెంకటాపురం, శనగపాడు తదితర గ్రామాల్లో సుమారు 5 వందల ఎకరాల్లో పసుపును సాగుచేస్తున్నారు. ఈ పంట ఉద్యానవన పంట పరిధిలో ఉన్నప్పటికీ సాగుదారులకు మాత్రం ప్రభుత్వం నుంచి అందాల్సిన రాయితీలు సక్రమంగా అందటం లేదు. సూచనలు, సలహాలు అందించాల్సిన ఉద్యానవన అధికారులు తమ వైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
20 సంవత్సరాల నుంచి పసుపు సాగు చేస్తున్నా, నష్టాలే చవిచూస్తున్నామని రైతులు వాపోతున్నారు. ఇక చేసేది లేకే ఈ ఏడాది సాగు చేసిన పంటలో విత్తనానికి పసుపు కొమ్ములు తీయకుండా, పూర్తిగా వండేస్తున్నామని రైతులు తెలిపారు. ఇప్పటికైనా ఉద్యాన శాఖ అధికారులు ఈ ప్రాంతంపై దృష్టి సారించకపోతే పసుపు పంట ఈ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.
ఇదీ చదవండి: