Incompetence of the Minister of State Industries : పారిశ్రామిక రంగంపై అవగాహన కంటే.. అసలు విషయాన్ని పక్కదారి పట్టించి అడ్డగోలు, అసందర్భ వాదనతో నెట్టుకురావడంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ దిట్ట! తన, ప్రభుత్వ అసమర్థత బయటపడకుండా ఆయన చాలా విన్యాసాలు ప్రదర్శిస్తుంటారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) 2022 ఆగస్టులో ఇవ్వాల్సిన పెట్టుబడి రాయితీల్ని ప్రభుత్వం ఇంత వరకు చెల్లించకపోవడంపై అడ్డగోలు వాదన వినిపించారు. వచ్చే నెలలో విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉండటంతో పెట్టుబడి రాయితీల్ని ఇప్పటి వరకు ఇవ్వలేక పోయామని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సమ్మిట్ సందర్భంగా ఫిబ్రవరిలో రాయితీలు విడుదల చేయాలనుకున్నామని చెప్పారు. అయితే, తీరా చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చేసింది.. ఫిబ్రవరిలో కూడా ఇవ్వలేకపోతున్నాం.. కోడ్ తొలగించగానే ఇచ్చేస్తాం.. అని వెల్లడించారు. కాగా, మంత్రి చెప్పిన ఈ అసత్యపు, అడ్డగోలు వాదననే వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా ‘ఫ్యాక్ట్ చెక్’ పేరుతో శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఓటర్లను ప్రభావితం చేసేలా... సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ నెల 10న వైఎస్సార్ కల్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా పథకాల కింద 4,536 మంది లబ్ధిదారులకు నిధులు విడుదల చేశారు. మళ్లీ ఈ నెల 22న వైఎస్సార్ లా నేస్తం కింద 2,011 మంది లబ్ధిదారులకు కోటీ యాభై వేలు విడుదల చేశారు. ఆ రెండు పథకాల లబ్ధిదారులకు డబ్బులివ్వడానికి ఎన్నికల కోడ్ అడ్డంకి కాలేదు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను అవి ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ వాటికి అడ్డంకి కాని ఎన్నికల కోడ్.. పరిశ్రమలకు రాయితీలు చెల్లించడానికి అడ్డొచ్చిందని కొత్త వాదన వినిపిస్తున్నారు. 2022 ఆగస్టులో చెల్లించాల్సిన రాయితీల్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు సందర్భంగా 2023 ఫిబ్రవరిలో ఇద్దామని 8 నెలలు వాయిదా వేశామని చెప్పుకొచ్చారు.
కోడ్ కూస్తున్నారు.. ప్రభుత్వ వైఫల్యాల్ని కప్పిపుచ్చుకోవడానికి మంత్రి అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు. గత ప్రభుత్వం సకాలంలో రాయితీలిచ్చేది కాదని చెప్తూ.. తాము ఒక క్యాలెండర్ ప్రకారం ప్రతి ఆగస్టులోనూ పరిశ్రమలకు రాయితీలు విడుదల చేస్తామని గొప్పలు చెప్పిందీ ఈ ప్రభుత్వమే. ఎందుకు ఇవ్వలేదని అడిగితే మాత్రం... పరిశ్రమల శాఖ మంత్రి గారికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అసలు ఎన్నికల కోడ్‌కీ, పారిశ్రామిక రాయితీలకూ సంబంధమేంటి? అది ఏటా జరిగే తతంగమే. ఎన్నికల కోడ్ అడ్డంకే అనుకుంటే ఈసీ అనుమతి తీసుకుని అమలు చేయవచ్చు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. ఫిబ్రవరి 9న కోడ్ అమల్లోకి వచ్చేలోపే రాయితీ మొత్తం విడుదల చేసి ఉండొచ్చు కదా! అలా గాకుండా తన చేతగానితనాన్ని ఎన్నికల కోడ్ మీదకు నెట్టేయడమెందుకు?
వితండ వాదం.. వాస్తవానికి 2023 మార్చిలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు కోసం.. ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేయాల్సిన పారిశ్రామిక రాయితీల్ని వాయిదా వేశామని చెప్పడం వింతగా ఉంది. ఎంఎస్‌ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు రాయితీలు చెల్లించడానికి ఈ సమ్మిట్‌కి సంబంధం ఉందా..? ఏదైనా పరిశ్రమ ఏర్పాటుకు చేసుకోవాలనుకున్న ఒప్పందాన్ని... ఇన్వెస్టర్స్ సదస్సు రోజుకు వాయిదా వేసుకున్నామంటే అర్థం చేసుకోవచ్చు. సదస్సులో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల్ని తెలుసుకోవాలనుకునేవారూ ఉంటారు. కానీ బకాయిల చెల్లింపు అంశాన్ని సమ్మిట్‌కి ముడిపెట్టడం కేవలం సాకు కాదా?
ఇవీ చదవండి :