కృష్ణా జిల్లాలో తెలంగాణ మద్యం ఏరులై ప్రవహిస్తోంది. లాక్‌డౌన్ తర్వాత జిల్లాలో మద్యం దుకాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. మద్యం ధరలను దాదాపు 75 శాతం పెంచారు. అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విపరీతంగా అమ్మకాలు జరిగాయి. గతంలో రోజుకు సగటున రూ.1.5లక్షలు అమ్మిన దుకాణాలు మూడు రోజుల్లోనే రూ.5 లక్షల చొప్పున విక్రయించాయి. ఈ క్రమంలో తెలంగాణలో మద్యం అమ్మకాలు ప్రారంభించారు. జిల్లాలో దొరికే మద్యం ధరతో పోలిస్తే భారీగా వ్యత్యాసం ఉండడంతో తెలంగాణ నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు.
జిల్లాలో ఉన్న 265 దుకాణాల్లో ప్రస్తుతం 174 మాత్రమే తెరిచారు. రెడ్‌జోన్లలో ఉన్న సిబ్బందిని రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెట్టారు. దీంతో పెద్దఎత్తున అక్రమ మద్యం సరఫరా చేసేవారు దొరుకుతుండగా.. ఇతర మార్గాల్లో రాష్ట్రంలోకి ఎన్‌డీపీ మద్యం ప్రవహిస్తోంది. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆధ్వర్యంలో స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో పేరిట గత ఐదు రోజులుగా తనిఖీలు చేస్తున్నారు. చందర్లపాడు, మైలవరం, ఏ.కొండూరు తదితర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా వాహనాలపై అక్రమ మద్యం తరలిస్తున్న వారిని పట్టుకుంటున్నారు.
ధర తక్కువతోనే...
సాధారణంగా మద్యం ప్రియులు వినియోగించే ఓ కంపెనీ పావు (క్వార్టర్) సీసా దుకాణంలో రూ.350 ధర ఉంది. ఇదే తెలంగాణ ప్రాంతంలో రూ.160కే లభిస్తోంది. అంటే వ్యత్యాసం రూ.190. ఇంకేముంది కొంత మంది దీన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. తెలంగాణ నుంచి పెద్దఎత్తున మద్యం సీసాలు తెచ్చి కృష్ణా జిల్లాలో విక్రయిస్తున్నారు. గొలుసు దుకాణంలో రూ.250-300 చొప్పున విక్రయిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా మూతపడిన మద్యం దుకాణాలు 40 రోజుల తర్వాత తెరుచుకున్నాయి. దీంతో మద్యం అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాత్రి 7గంటల వరకే అమ్మకాలు సాగించాల్సి ఉండగా.. కొంతమంది సిబ్బంది సీసాలను బయటకు తెచ్చి రెట్టింపు ధరకు రాత్రి 11 గంటల వరకు విక్రయిస్తున్నారు. మద్యం అలవాటు మాన్పించేందుకు దుకాణాలు, అమ్మకాలపై ప్రభుత్వం నిబంధనలు విధిస్తే ఏకంగా పన్ను చెల్లించని మద్యం(ఎన్‌డీపీ) చలామణిలోకి వచ్చింది.
ఇదీ పరిస్థితి.!
- మార్చి 22 నుంచి మే 10 వరకు ఎక్సైజ్ అధికారులు కట్టిన కేసులు 40
- అరెస్టయిన వ్యక్తులు 50
- స్వాధీనం చేసుకున్న మద్యం(లీటర్లు) 306
- వాహనాలు స్వాధీనం 18
గత ఐదు రోజుల్లో
- పోలీసులు నమోదు చేసిన కేసులు 143
- వాహనాలు స్వాధీనం 67
- అరెస్టయిన వ్యక్తులు 199
- స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లు 2954
ఇదీ చదవండి: రైలు ప్రయాణికుల అడ్రెస్లు నమోదు తప్పనిసరి!