కృష్ణా జిల్లా పెడన మండలం పెనుమల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని పడమట హర్షిత వివిధ రకాల మట్టితో తయారు చేసిన కుండతో ఫ్లోరైడ్‌ను కట్టడి చేయవచ్చనే ప్రాజెక్టు రూపకల్పన చేసింది. కుండలో నీరు వేసిన తరువాత పరిశీలిస్తే ఫ్లోరైడ్ తొలగిపోయిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ‘మేజిక్ పాట్.. ఫ్లోరైడ్ అవుట్’ పేరుతో ప్రాజెక్టు తయారీకి పాఠశాల ఉపాధ్యాయుడు కృపావర్దన్ సహకారం తీసుకుంది. గత విద్యా సంవత్సరంలో శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్) ఇన్నోవేషన్ అవార్డుకు ఆ ప్రాజెక్టు ఎంపికైంది. జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకుతో హర్షితకు రూ.20 వేలు నగదు ప్రోత్సాహకం, జ్ఞాపిక, ధ్రువపత్రాన్ని సీఎస్‌ఐఆర్ బాధ్యులు అందజేశారు.
కరోనా సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా సులభతరంగా మాస్కులు, శానిటైజర్ల తయారీ.. తక్కువ నీటితో మొక్కల పెంపకం.. పొలాల రక్షణకు గన్‌తో బొమ్మ కాపలా.. శాస్త్రీయంగా చేతుల శుభ్రత.. సాంకేతికతతో రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు సమకాలీన సమస్యలకు పరిష్కారం చూపే ప్రాజెక్టులను గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన విద్యార్థులు తయారు చేసి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్‌తో పాటు ఇన్‌స్పైర్‌లోనూ సత్తా చాటారు. ఆ సృజనకు మరింత పదును పెట్టడంతో పాటు నవ ఆలోచనలతో రూ.లక్ష బహుమతి అందుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కొవిడ్‌తో ఇంటికే విద్యార్థులు పరిమితమైన వేళ సమాజానికి ఉపయోగపడే ఆలోచనలను సీఎస్‌ఐఆర్ ఆహ్వానిస్తోంది.
విషయం: సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు ఫర్ స్కూల్ చిల్డ్రన్-2021
నిర్వహణ ఎవరు: శాస్త్రీయ పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్‌ఐఆర్)
ఎందుకు : పాఠశాల స్థాయిలోనే చిన్నారుల్లో శాస్త్రీయ వైఖరిని ప్రేరేపిస్తూ.. మేధోసంపత్తిని సృష్టించే ప్రయత్నం చేస్తోంది. నూతన ఆవిష్కరణల దిశగా పిల్లల్ని ప్రోత్సహించేందుకు ఇన్నోవేషన్ అవార్డును అందజేస్తుంది.
పోటీకి ఎవరు అర్హులు: 18 ఏళ్ల లోపు వయసు కలిగిన విద్యార్థులు. పాఠశాల స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులు అవార్డుకు దరఖాస్తు చేసుకోవచ్ఛు
పోటీలో పాల్గొనడం ఎలా.. : ఆన్‌లైన్ ద్వారా ఈ పోటీని నిర్వహిస్తున్నారు. ఏదైనా కొత్త భావన.. ఆలోచన.. రూపకల్పన.. సమస్యకు పరిష్కారం చూపే ప్రతిపాదన పంపాలి. సమర్పించిన ప్రతిపాదన నవీన భావన ఆలోచన అయి పూర్తిగా ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఆ భావన నమునా ద్వారా లేదా డేటా, డిజైన్ల ద్వారా నిరూపించాలి. ప్రతిపాదన రూపకల్పనలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్నేహితుల సహాయం తీసుకుంటే వారి వివరాలు తప్పనిసరిగా ఉండాలి. ప్రతిపాదన ఆంగ్లం, హిందీ భాషలో ఐదు వేల పదాలకు మించకుండా రూపొందించాలి. ప్రతిపాదన టైటిల్, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఫోన్ నెంబరు, మెయిల్ ఐడీ, పాఠశాల చిరునామా, నివాస ప్రాంత చిరునామా ఉండాలి.
ఎవరికి పంపాలి: ప్రతిపాదన సాఫ్ట్ కాపీని ciasc.ipu@niscair.res.inకు మెయిల్ చేయాలి. హార్డ్‌కాపీని హెడ్, సీఎస్‌ఐఆర్-ఇన్నోవేషన్ ప్రోటెక్షన్ యూనిట్, నిస్‌కైర్ బిల్డింగ్, 14 సత్సంగ్ విహార్ మార్గ్, స్పెషల్ ఇనిస్టిట్యూషనల్ ఏరియా, న్యూ దిల్లీ-110067 చిరునామాకు రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా పంపాలి.
ప్రతిపాదనలు పంపేందుకు చివరి తేదీ: ఈ నెల 31
బహుమతులు ఇలా: జాతీయ స్థాయిలో ఈ పోటీ ఉంటుంది. మొదటి బహుమతిగా ఒకరికి రూ.లక్ష నగదు అందజేస్తారు. ద్వితీయ బహుమతిగా ఇద్దరికి రూ.50 వేలు (ఒక్కొక్కరికి) చొప్పున, తృతీయ బహుమతిగా ముగ్గురికి రూ.30 వేలు చొప్పున, నాలుగో బహుమతిగా నలుగురికి రూ.20 వేలు చొప్పున, ఐదో బహుమతిగా రూ.10 వేలు ఐదుగురికి అందజేస్తారు. సెప్టెంబరు 26వ తేదీన దిల్లీలో జరిగే సీఎస్‌ఐఆర్ ఆవిర్భావ దినోత్సవాల్లో బహుమతులను ప్రముఖుల చేతుల మీదుగా అందిస్తారు.
అవార్డు సాధించేలా ప్రోత్సాహం: గుంటూరు జిల్లాలో ఇంటర్ విద్యార్థులు 99,075 మంది, కృష్ణాలో 1,12,054 మంది, రెండు జిల్లాల్లో కలిపి ఆరు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులు సుమారు ఆరు లక్షల మంది ఉన్నారు. వీరంతా పోటీలో పాల్గొనేందుకు అర్హులే. నవ ఆలోచనకు మంచి పారితోషికంతో పాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉంది. సీఎస్‌ఐఆర్ ఇన్నోవేషన్ అవార్డు సాధించేలా ప్రతిభావంతులైన విద్యార్థుల్ని ప్రోత్సహిస్తున్నట్లు కృష్ణా జిల్లా డీఈవో తాహెరా సుల్తానా, సైన్స్ అధికారి మైనం హుస్సేన్, గుంటూరు జిల్లా సైన్స్ అధికారి మధుసూదనరావు తెలిపారు.
ఇదీ చదవండీ.. కూర్చున్న చోటే మహిళ ప్రసవం.. మంత్రి ఆరా