Chandrababu announced New activity of TDP: ప్రజలతోపాటు కార్యకర్తలు, నేతల భవిష్యత్తుకు గ్యారంటీ ఉండేలా తెలుగుదేశం అధినేత చంద్రబాబు సరికొత్త కార్యాచరణ ప్రకటించారు. బూత్ స్థాయి కమిటీ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకూ ప్రతి ఒక్కరి పనితీరు ఎప్పటికప్పుడు మదించి ప్రతీనెలా వారికి తగు యాక్షన్ ప్లాన్ తయారు చేసి ఇచ్చే బ్యాకాఫీస్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రక్రియ ద్వారా వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓటు రూపంలో తెలుగుదేశానికి మలచుకునే సాంకేతిక మెకానిజం సత్ఫలితాలనిస్తుందని అధినేత ధీమా వ్యక్తం చేశారు.
బ్యాకాఫీస్ బృందాల ఏర్పాటు... తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉండవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ ముఖ్య నేతలతోదాదాపు 3గంటలపాటు సమావేశమై వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు సహా సీనియర్ నేతలు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ఏలూరి సాంబశివరావు, జీవీ ఆంజనేయులు, అనగాని సత్యప్రసాద్, నక్కా ఆనంద్ బాబు బాబు తదితరులు ఈ భేటీలో పాల్గొని అధినేత ఆలోచనలు పంచుకున్నారు. బూత్ స్థాయి నుంచి ఇన్ఛార్జ్ వరకు ప్రతి ఒక్కరి పనితీరుపై రెండేసి సర్వేలు నిర్వహిస్తూ ప్రతి నెలా నివేదిక ఇచ్చే ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నట్లు చంద్రబాబు నేతలకు వివరించారు. ఇందుకోసం ప్రతీ నియోజకవర్గానికి బ్యాకాఫీస్ బృందంగా దాదాపు 10మంది సభ్యులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తారు. ప్రతీ నియోజకవర్గంలో గత 3ఎన్నికల ఫలితాలు విశ్లేషించి తాజా పరిస్థితులకు తగ్గట్టుగా నేతలకు ఈ కమిటీలు యాక్షన్ ప్లాన్ ఇవ్వనున్నాయి. బూత్ కమిటీలు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జ్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇలా నాలుగు దశల్లో అందరి పనితీరును కమిటీ సభ్యులు మదింపు చేయనున్నారు. ఏ స్థాయిలో పొరపాటు ఉంటే ఆ స్థాయిలో తప్పులు సరిదిద్దుకునేలా కమిటీలు ప్రతినెలా నివేదికలు ఇవ్వనున్నాయి. నాలుగు స్థాయిల్లో ప్రతీ ఒక్కరి పనితీరు ఆధారంగా వారికి పదవుల్లోనూ ప్రాధాన్యత కల్పించాలని చంద్రబాబు నిర్ణయించారు. ప్రతీ నెలా 3, 18వ తేదీల్లో సమన్వయ కమిటీ సమావేశాలు, 8వ తేదీన గ్రామ కమిటీ, 12వ తేదీన మండల కమిటీ, 22వ తేదీన జిల్లా సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించుకునేలా క్యాలెండర్ రూపొందించారు.
వ్యతిరేకత ఏకం చేయడానికి... వైసీపీపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నందున అందుకు తగ్గట్టుగా తెలుగుదేశం పార్టీ రూపొందించుకున్న వ్యూహం సత్ఫలితాలనిస్తుందని నేతలు ధీమా వ్యక్తం చేశారు. విభజన వల్ల జరిగిన నష్టం కంటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఏపీకి ఎక్కువ నష్టం జరిగినందున ఈసారి రాష్ట్రం గెలవాలన్నదే తమ నినాదమని తేల్చిచెప్పారు. ఎలక్షనీరింగ్ పకడ్భందీగా నిర్వహించేలా పార్టీ ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ఎన్నికలు ముందొచ్చినా, వెనకొచ్చినా తెలుగుదేశం పార్టీ సర్వసన్నద్ధంగా ఉందని తేల్చిచెప్పారు. పోల్ మేనేజ్మెంట్లో కేడర్‌కు శిక్షణ ఇస్తామని చెప్పారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తొలిగించే కుట్రలను ధీటుగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు. ఓట్ల అవకతవకల్లో ఏ స్థాయి అధికారులు ఉన్నా వారిపై కేసులు పెట్టి చట్టపరంగా శిక్షపడేలా చూస్తామని హెచ్చరించారు.
సాధికార సారథికి అదనం... ప్రతి 40 కుటుంబాలకో సాధికార సారధిని ఇప్పటికే నియమించుకున్నందున వ్యవస్థ మొత్తం పకడ్బందీగా పనిచేసేలా తాజా విధానం ఉపయోగపడుతుందని తెలుగుదేశం నేతలు అంచనా వేస్తున్నారు. బూత్ స్థాయి నుంచీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకూ కష్టపడేవారిని గుర్తించి గౌరవించే విధానానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని వెల్లడించారు. బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి.. వారి వివరాలు అధికారులకు అందించామని స్పష్టం చేశారు. బీఎల్ఓలు అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చూడాలని కోరారు. బీఎల్‌ఓలు సరిగా వ్యవహరించకుంటే తమ పార్టీకి చెందిన బీఎల్ఏల ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. తాజా విధానాన్ని తొలుత 15నియోజకవర్గాలతో ప్రారంభించి 175 నియోజకవర్గాల్లోనూ ఇదే ప్రణాళిక అమలయ్యే కార్యాచరణకు తెలుగుదేశం సిద్ధమవుతోంది.