కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు ప్రేరేపించేలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెదేపా నేతలు నిరసన చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ లో మైనారిటీ నాయకులతో కలిసి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ధర్నాకు దిగారు. అమరావతి రైతులకు బెయిల్ ఇవ్వని ప్రభుత్వం.. అబ్దుల్ సలాం కేసులో గంటల వ్యవధిలోనే నిందితులు బెయిల్ మంజూరు చేసే విధంగా వ్యవహరించిందని ఆరోపించారు. సలాం కుటుంబం ఆత్మహత్యకు నిరసనగా.. విజయవాడలో ముస్లిం మైనార్టీలతో కలిసి గద్దె రామ్మోహన్ నిరసన కార్యక్రమం చేపట్టారు. పరిహారాలిచ్చి తప్పులను సరిపుచ్చుకోవాలని చూస్తున్నారని దుయ్యబట్టారు.
జగ్గయ్యపేటలో అంబేడ్కర్ విగ్రహం వద్ద ముస్లిం మైనారిటీ సభ్యులతో తెదేపా నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆత్మహత్యల ఘటనకు సంబంధించిన పోలీసులను, వైకాపా నాయకులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నవంబర్ 13వ తేదీ వరకు సలాం కుటుంబానికి న్యాయం జరిగే వరకు రాష్ట్రవ్యాప్తంగా తెదేపా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.
ఇదీ చదవండి: ఆరోగ్యశ్రీ వైద్య సేవల విస్తరణ ప్రారంభించిన సీఎం జగన్..