రైతు కోసం- తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఆందోళనలు మూడో రోజు కొనసాగాయి. వర్షాలతో నష్టపోయిన రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లాలో
నివర్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని తెదేపా నేత తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా వీరులపాడులో రైతులకు న్యాయం చేయాలంటూ.. ర్యాలీగా వెళ్లిన తెదెపా నేతలు తహసీల్దార్‌కు మెమోరాండం అందజేశారు. రైతన్నకు న్యాయం చేసేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలను తేవాలన్నారు.
తూర్పుగోదావరిలో
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో రైతుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులు వెంటనే రైతుల అకౌంట్‌లో వేయాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో
రైతు సమస్యలపై.. రైతు కోసం కార్యక్రమంలో భాగంగా.. గుంటూరు జిల్లా తెనాలిలో తెదేపా నేతలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. రైతుల వద్ద నుంచి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసి.. వారికి వెంటనే నష్ట పరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
నెల్లూరులో
నివర్ తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నామమాత్రంగా సహాయం చేసిందని.. తేదేపా నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ విమర్శించారు. పంట నష్టపోయిన రైతులకు ఈ పరిహారం సంక్రాంతి కానుకని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు.
ప్రకాశంలో
రైతుల కోసం కార్యక్రమంలో భాగంగా.. ప్రకాశం జిల్లా కనిగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన ఈరోజు జరగాల్సి ఉండగా ఆగపోయింది. కడప జిల్లాలోని పొద్దుటూరులో హత్యకు గురైన సుబ్బయ్య అంత్యక్రియలకు ఆలస్యమవుతుందన్న కారణంగా ఆగిపోయింది.
అనంతపురంలో
అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో తెదేపా, కమ్యూనిస్టు పార్టీలు సంయుక్తంగా మహా ధర్నా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయాలు, సచివాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
గతంలో వర్షాలు లేక జిల్లాలో కరువు వస్తే.. ఈసారి నివర్ తుపాను కారణంగా అధిక వర్షాల వల్ల కరువు వచ్చిందని వారు తెలిపారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లాలోని హిందూపురంలో తెదేపా శ్రేణులు ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. రైతాంగాన్ని ఆదుకోకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమం చేపడతామని వారు హెచ్చరించారు.
విజయనగరంలో
రైతు సమస్యలు పరిష్కరించాలంటూ.. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో తెదేపా నేతలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించారు.ఆత్మహత్య చేసుకున్న రైతులకు బీమా సదుపాయం కల్పిస్తూ.. రూ.7లక్షల పరిహారం అందించాలన్నారు.