కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన అఖిల భారత చేనేత మండలిని పునరుద్ధరించాలని కోరుతూ... కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లేఖ రాశారు. చేనేత కార్మికుల సంక్షేమ చర్యల్లో భాగంగా 1992లో కేంద్ర చేనేత, జౌళిశాఖ దీనిని ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. సభ్యులు తరచూ సమావేశమై చేనేత అభివృద్ధి, సంక్షేమంపై కేంద్రానికి సిఫార్సులు చేసేవారని అన్నారు. చేనేత రంగంలో సంపూర్ణ అభివృద్ధి, కార్యక్రమాల రూపకల్పనకు ఈ బోర్డు ఎంతో సహకరించిందని తన లేఖలో పేర్కొన్నారు. చేనేత రంగం ఎదుర్కొనే సమస్యలు పరిష్కరించడం, నిరుద్యోగాన్ని తగ్గించటంలో బోర్డు ఎంతగానో కృషి చేసిందని చెప్పారు.
చేనేతను ఆదుకోవాలి...
ప్రభుత్వానికి, నేతన్నలకు మధ్య ఉన్న ఏకైక వారధి చేనేత బోర్డేనన్న లోకేశ్... రద్దు వల్ల అభిప్రాయాలను తెలుసుకునే వీలు లేకుండా పోయిందని ఆవేదన చెందారు. అఖిల భారత చేనేత బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని కోరారు. చేనేత రంగ అభివృద్ధి, పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని, అనేక ఇబ్బందుల్లో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీచదవండి.