CBN KRISHNA DISTRICT TOUR : ఎమ్మెల్సీ ఎన్నికల్లో వరుస విజయాల జోష్ తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి మూడు రోజుల పాటు కృష్ణా జిల్లాలో పర్యటిస్తుండటంతో కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పసుపు శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయి. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కృష్ణా జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షో నిర్వహిస్తారు. నేడు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ నుంచి చంద్రబాబు సమక్షంలో భారీ ఎత్తున టీడీపీలోకి చేరికలు ఉన్నాయి. ఈ కార్యక్రమం అనంతరం బందరు రోడ్డు మీదుగా చంద్రబాబు మచిలీపట్నం బయలుదేరతారు. బందరులో మూడు స్తంభాల సెంటర్ నుంచి కోనేరు సెంటర్ మీదుగా హిందూ కళాశాల వరకు రోడ్ షో నిర్వహించి అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అయితే బందర్లో బాబు బహిరంగ సభ అనంతరం ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరులో బస చేయనున్నారు.
తొలిసారి నిమ్మకూరులో అధినేత బస: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ సొంతగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరు. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నిమ్మకూరులో తొలిసారి బస చేయబోతున్నారు. ఎన్టీఆర్ ఇంటి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో బస ఏర్పాట్లు చేస్తున్నారు. నిమ్మకూరు అల్లుడుగా తొలిసారి బస చేయడంతో గ్రామస్థుల్లో ఆసక్తి నెలకొంది. నిమ్మకూరులో ఎన్టీఆర్, బసవతారకం విగ్రహం వద్ద నివాళులర్పించి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభిస్తారు. అక్కడి నుంచి గుడివాడ చేరుకుని రోడ్ షో, బహిరంగ సభల్లో పాల్గొంటారు. అక్కడే బస చేసి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు.
తన పర్యటనలో భాగంగా మచిలీపట్నంలో బందరు పోర్టు నిర్మాణానికి సంబంధించి కీలక ప్రకటనలు చేయనున్నారు. బందరు పోర్టు నిర్మాణాల కోసం పోరాటాలు చేయాల్సి వస్తుందని ఇప్పటికే శ్రేణులకు పిలుపునిచ్చిన చంద్రబాబు.. నేతల్లో, కార్యకర్తల్లో నెలకొన్న నైరాశ్యాన్ని తొలగించి వారికి దిశా నిర్థేశం చేయనున్నారు. ఈ పర్యటనలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలను తూర్పారపడుతూనే కార్యకర్తల్లో ఉత్సాహం నింపి, నాయకులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. అక్కడక్కడ నెలకొన్న అంతర్గత సమస్యలు పరిష్కరించే అవకాశం ఉంది. ప్రధానంగా గుడివాడపై కార్యకర్తల దృష్టి నెలకొంది.
పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: మూడో రోజు గుడివాడలోని హనుమాన్ జంక్షన్ మీదుగా నూజివీడు వెళతారు. అక్కడ రోడ్ షో అనంతరం బహిరంగ సభలో పాల్గొని తిరిగి గన్నవరం చేరుకుంటారు. అయితే చంద్రబాబు నాయుడు రోడ్ షోలను విజయవంతం చేసేందుకు ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలు గత మూడు రోజులుగా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ప్రధానంగా బందరులో భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ సర్కిల్, ఆటో నగర్ వద్ద కార్యకర్తలు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకి, పెనమలూరులో అధినేతకు కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు.
ప్రధానంగా గుడివాడే గురి: గుడివాడ నియోజకవర్గాన్ని ఈ సారి టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున దేవినేని అవినాష్‌కు టిక్కెట్ ఇస్తే.. ఆయన ఓటమి పాలయ్యారు. ఈసారి బలమైన అభ్యర్థి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నారు. నియోజకవర్గంలో వెనిగండ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐ వెనిగండ్ల రాము పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్నారు. సమస్యలపై కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో మమేకం అవుతున్నారు. మరోవైపు రావి వెంకటేశ్వరరావుకు ,ఆయనకు మధ్య కొంత దూరం పెరిగింది. దీంతో అక్కడ సమస్యను పరిష్కరించే అవకాశం ఉంది.
ప్రణాళిక ప్రకారం గుడివాడలో వ్యూహం: గుడివాడలో క్యాసినో, దేవాలయ భూముల కబ్జా, టిడ్కో ఇళ్ల జాప్యం, చేపల చెరువుల తవ్వకాలు, రెవెన్యూ అధికారులపై దాడి లాంటి అరాచకాలు జరుగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని దురుసుగా వ్యవహరిస్తూ.. చంద్రబాబు ఆయన కుటుంబంపై వ్యాఖ్యలు చేస్తున్నా.. స్థానికంగా ఎదుర్కోవడం లేదన్న అసంతృప్తి ఉంది. దీనిపై ప్రణాళిక రూపొందించి గుడివాడ నియోజకవర్గంలో వ్యూహం రూపొందించే అవకాశం ఉంది. గన్నవరం నియోజకవర్గం ఇంఛార్జిగా ఉన్న బచ్చుల అర్జునుడు ఇటీవల గుండెనొప్పితో ఆసుపత్రి పాలై మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ కూడా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. ఇతర పార్టీల నుంచి కొంతమంది నేతలు చేరికలు ఉండే అవకాశం ఉంది.
కృష్ణా జిల్లా పర్యటన అనంతరం వచ్చే వారం ప్రకాశం జిల్లా వినుకొండ, ఎర్రగొండపాలెం, మార్కాపురంలో చంద్రబాబు పర్యటించే అవకాశం ఉంది. ఈ నెలాఖరుకు శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆముదాలవలస నియోజకవర్గాల్లో.. మే మొదటి వారంలో ముమ్మిడివరం, అమలాపురం, నరసాపురం నియోజకవర్గాల్లో.. రెండో వారం శ్రీకాళహస్తి ,సత్యవేడు, చిత్తూరు జిల్లా నగరిలలో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళిక సిద్దమవుతోంది. మహానాడుకు ముందు అద్దంకి, సంతనూతలపాడు, ఒంగోలులో చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమం ఉండవచ్చని సమాచారం.
ఇవీ చదవండి: