ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకైన అమరావతి వైకాపా మొదటి నుంచీ వ్యతిరేకించిందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరిలో మాట్లాడిన ఆయన అమరావతిని వ్యతిరేకించేందుకు వైకాపా నేతలు సర్వశక్తులు ఒడ్డారని ఆరోపించారు. పంట పొలాలు తగలబెట్టారని తప్పుడు ప్రచారం చేశారన్నారు. కొంతమందితో హైకోర్టులో పిటిషన్ వేయించారని విమర్శించారు. రాజధాని శంకుస్థాపనకు పిలిచినా వైకాపా నేతలు రాలేదన్న చంద్రబాబు...ఇప్పుడు పెట్టుబడులు అడ్డుకునే పరిస్థితికి వచ్చారన్నారు. తెదేపా కృషి ఫలితంగానే రాజధానిలో భవనాలు తయారయ్యాయన్నారు.
'ప్రపంచబ్యాంకు రుణం రాకుండా వైకాపా నేతలు అడ్డుపడ్డారు. రుణాలు రాకుండా పిటిషన్లు వేశారు. ఫిర్యాదులు చేశారు'-----చంద్రబాబు నాయుడు, తెదేపా జాతీయ అధ్యక్షుడు
తెలంగాణకు నీరు ఇవ్వడం ముఖ్యమా?
రాష్ట్రానికి రెండు కళ్లైన అమరావతి, పోలవరం పట్ల సీఎం జగన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరాన్ని అడ్డుకుని తెలంగాణకు నీరు ఇవ్వడమే ముఖ్యమనే రీతిలో జగన్ వ్యవహరశైలి ఉందని ఆరోపించారు. రాజధాని వైకాపా సొంత జాగీరు కాదన్న ఆయన వాన్ పిక్, లేపాక్షి తరహాలో అమరావతిని చేయలనుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రపంచం మొత్తం గొప్పగా చర్చించుకున్న అమరావతి.. వైకాపా తీరుతో చెడుగా చెప్పుకునే పరిస్థితి వచ్చిందని ఆక్షేపించారు.
రైతులను రెచ్చగొట్టినా..
జరగని అవినీతిని ప్రస్తావించి వైకాపా రాష్ట్రానికి అన్యాయం చేస్తుందని చంద్రబాబు అన్నారు. అమరావతి అంటే వైకాపా నేతలకు ఎగతాళిగా ఉందన్నారు. రాజధాని ప్రాంతంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్న చంద్రబాబు...భూములు ఇవ్వొద్దని రాజధాని రైతులను రెచ్చగొట్టినా 99 శాతం మంది స్వచ్ఛందంగా ఇచ్చారని స్పష్టం చేశారు. వైకాపా నేతల వరుస ఫిర్యాదులతోనే ప్రపంచబ్యాంకు వెనక్కి తగ్గిందని చంద్రబాబు పేర్కొన్నారు.
భూముల విలువ తిరోగమనం
పర్యావరణ, ఆర్థిక, సామాజిక రంగాలపై ప్రభావం ఉంటుందని అమరావతిపై దుష్ప్రచారం చేశారని చంద్రబాబు అన్నారు. వైకాపాకి ఉన్న అవినీతి ముద్రను తెలుగుదేశంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల విలువైన అమరావతి భూముల ధరలు వైకాపా వల్ల బాగా పడిపోయాయని వెల్లడించారు. రాజధానిలో ముళ్లతుంపలు తప్ప మరేవీ లేవని మంత్రులే చెప్తే పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు.
ఇదీ చదవండి : ఆరోపణలు కాదు.. ఆధారాలు చూపాలి: కోడెల