Achchennaidu angry on CM Jagan: బీజేపీ మద్దతు లేకుండానే వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ ఆగిందా అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నిలదీశారు. దిల్లీ వెళ్తున్న ప్రతిసారి.. బీజేపీతో తమకూ సంబంధాలు ఉన్నాయని జగన్ చెప్పుకుంటూ రాలేదా అని ప్రశ్నించారు. జగన్ ఆస్తుల కేసులు ముందుకెళ్లడం లేదు.. బీజేపీ సహకారం లేకుంటే సాధ్యమా అని నిలదీశారు.
సహకారం లేదంటే ఎలా నమ్మాలి... బీజేపీ సహకారం లేకుండానే అప్పులు తెచ్చుకుంటున్నారా..? రెవెన్యూ లోటు నిధులు వచ్చాయా..? అంటూ మండిపడ్డారు. బీజేపీ నేతలు విమర్శలు చేస్తే.. దానికి సమాధానం చెప్పాలి కానీ, తమకేం సంబంధమని దుయ్యబట్టారు. టీడీపీ ట్రాపులో బీజేపీ పడిందని చెప్పడం డ్రామా కాదా అంటూ అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తన కేసుల్లో జగన్ కోర్టులకూ వెళ్లడం లేదు.. ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు. అవినాష్ రెడ్డి అరెస్ట్ జరిగితే.. జగన్ కేసులు ముందుకెళ్తే బీజేపీతో జగన్‌కు సంబంధం లేదని జనం నమ్ముతారని అన్నారు. బీజేపీ నేతలు ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారో వారినే అడగాలని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
భవిష్యత్‌కు గ్యారెంటీ.. భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వెల్లడించారు. మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. తెలుగుదేశం నేతలు ఈ నెల 19నుంచి 5 బస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా తిరగనున్నట్లు తెలిపారు. 5 బస్సులపై మినీ మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని పథకాలను తెలుగుదేశం స్ట్రిక్కర్ ల రూపంలో అంటించి అన్ని నియోజకవర్గాలకు పంపనుందని, అధినేత చంద్రబాబు ఈ నెల 19న ఆయా బస్సులను జెండా ఊపి అమరావతిలో ప్రారంభించనున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
టీడీపీ పల్లె నిద్ర.. ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం నేతలు పల్లె నిద్ర చేపడతారని వెల్లడించారు. సోమవారం భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సులను చంద్రబాబు ప్రారంభిస్తారని, 30 రోజుల్లో 125 నియోజకవర్గాల్లో భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సుల్లో ప్రచారం పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామన్నారు. సంపద సృష్టించి.. ఆదాయం పెంచి.. పేదలకు పంచే నాయకుడు చంద్రబాబు అని చెప్తూ.. భవిష్యత్‌కు ఇబ్బందేం ఉండదని అన్నారు. చంద్రబాబు హయాంలో తెలంగాణ కంటే ఏపీ ఆదాయం ఎక్కువ ఉండేది కానీ, ఇప్పుడు రివర్సులో ఉందని విమర్శించారు. నాలుగేళ్లల్లో సుమారు 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏపీ కోల్పోయిందని అచ్చెన్న తెలిపారు. ఏపీ సంపదను గణనీయంగా పెంచి.. ఆదాయాన్ని ప్రజలకి పంచుతామని స్పష్టం చేశారు.