electricity adjustment charges Burden : విద్యుత్ సర్దుబాటు చార్జీల భారం, స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఏపీ అర్బన్ సిటిజన్ ఫెడరేషన్, ఏపీ టాక్స్ పేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రజాసంఘాల నాయకులు హాజరయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్దుబాటు, ట్రూ అప్ చార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలను అధిక మొత్తంలో పెంచిందని, దీనికి వ్యతిరేకంగా ప్రభుత్వాన్ని చట్టసభల్లో నిలదీస్తామని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు అన్నారు. ఎప్పుడో 2014-19 సంవత్సరాల మధ్య వినియోగించిన కరెంట్‌కి ఇప్పుడు ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు తెస్తామని చెప్పడం రాష్ట్ర ప్రభుత్వానికి సమంజసం కాదన్నారు. షిరిడి సాయి వంటి కార్పొరేట్ విద్యుత్ కంపెనీలకు లాభం చేకూర్చడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయటం ఏంటని ప్రశ్నించారు.
అదానీకి లాభం చేకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకుందని ఆంధ్ర చాప్టర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్మన్ పార్థసారథి విమర్శించారు. విద్యుత్ బిల్లులు చూస్తేనే భయమేస్తోందన్నారు. విద్యుత్ చార్జీల పెంపుతో అనేక రంగాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఆక్షేపించారు. సర్దుబాటు, ట్రూ అప్ చార్జీలు పేరుతో పేద ప్రజలు, మధ్యతరగతి పైన భారాలు వేయటం మంచిది కాదని హెచ్చరించారు. విద్యుత్ చార్జీల పెంపుతో రవాణా రంగం ఇబ్బంది ఎదుర్కొంటుందని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. ప్రభుత్వాలు బొగ్గు ధరలు అమాంతంగా పెంచేశాయని విమర్శించారు.
విద్యుత్ నిత్యావసర వస్తువు అనే అవకాశాన్ని ఉపయోగించుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సంస్కరణలు ప్రవేశపెట్టాయి. సంస్కరణల పేరిట ప్రజలపై భారాలను మోపుతున్నాయి. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సర్దుబాటుతో పెద్ద ఎత్తున విద్యుత్ చార్జీలు పెంచుతోంది. గతంలో 2014-19మధ్య వినియోగించిన విద్యుత్‌కు కూడా అదనపు చార్జీలు విధించడం సామాన్య ప్రజలపై భారం మోపడమే. అదానీ కంపెనీకి లాభాలు కట్టబెట్టేలా స్మార్ట్ మీటర్లు బిగించడం అతి పెద్ద దోపిడీ. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, సర్దుబాటు చార్జీలను ఉపసంహరించుకోవాలని మేం డిమాండ్ చేస్తున్నాం. - కేఎస్ లక్ష్మణ్ రావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
50ఏళ్లుగా పరిశ్రమలు నడుపుతున్నా కానీ, ఇటీవల విద్యుత్‌కు సంబంధించి 5 రకాల వడ్డింపులు జరిగాయి. అందులో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డ్యూటీ పేరిట 6పైసల నుంచి రూపాయికి పెంచారు. ట్రూ అప్ చార్జీలు 60 నెలల కరెంటుకు సంబంధించి 36 నెలలకు విభజించి చెల్లించాలని చెప్తున్నారు. ఎఫ్పీపీఏ చార్జీలు కూడా విధించారు. ఇవే కాకుండా పవర్ ఫ్యాక్టర్.. పాత వాటి పేరిట 20శాతం అదనంగా బాదుతున్నారు. అసలు పరిశ్రమలు నడిపే అవకాశమే లేకుండా పోతోంది. ఇండస్ట్రీ మనుగడను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - పార్థసారథి, ఆంధ్ర చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ చైర్మన్
విద్యుత్ పేరుతో ప్రజల జేబులు ఖాళీ.. చిరు పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు మొదలుకుని లూటీ చేస్తున్నారు. ఇది వడ్డన మీద వడ్డన. ఐదు రకాల పోట్లు పడ్డాయి. 2014లో వాడిన కరెంటుకు ఇప్పుడు చార్జీలు విధించడం ఏమిటో అంతుచిక్కడం లేదు. ఇకపై నెల నెలా చార్జీలు పెంచుతామని చెప్తున్నారు. వ్యవసాయ పంపు సెట్లు, ఇళ్లకు బిగించే మీటర్లు అదానీ మేలు కోసమే. దీనిపై పౌర సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తాం. - బాబూరావు, పట్టణ పౌర సమాఖ్య నాయకులు
కరెంటు బిల్లులు నాలుగు రకాలుగా వేస్తున్నారు. ఇది ఎవరికీ అర్థం కావడం లేదు. అంతచిక్కని రహస్యంగా మారింది. చిన్న పరిశ్రమలు, పెద్ద పరిశ్రమలపై పడుతున్న భారం పరోక్షంగా ట్రాన్స్ పోర్ట్ ఇండస్ట్రీ పైనా ప్రభావం చూపుతోంది. విద్యుత్ ఉత్పత్తి భారాలన్నీ సామాన్యులపై పడుతున్నాయి. అన్ని వర్గాలను పీల్చిపిప్పి చేస్తున్న సర్దుబాటు చార్జీలను తక్షణమే ఉపసంహరించాలి. - ఈశ్వరరావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి