విజయవాడ రామవరప్పాడు కూడలి నుంచి కొత్తూరుతాడేపల్లి మార్గం వరకు ఉన్న రహదారి ఇది. ఒడుదొడుకులు లేకుండా ఒక్క నిమిషం కూడా వాహనం నడవని రోడ్డిది. అడుగడుగునా గుంతలే. వర్షం పడితే నీటి కుంటలే. ఏడాదిన్నరగా వాహనదారులకు నరకం చూపుతోంది ఈ రహదారి. భారీ వాహనాలు కాదు కదా.. ద్విచక్రవాహనాలు కూడా తిన్నగా వెళ్లడం అసాధ్యంగా మారింది. నిర్వహణ, మరమ్మతులకు నోచుకోక అధ్వానంగా మారిన ఈ రోడ్డును వర్షాలు మరింత దారుణస్థితికి చేర్చాయి. నీటితో నిండిన గుంతల లోతు తెలియక వాహనాలు బోల్తాపడిపోతున్నాయి.
రెండేళ్ల క్రితం వరకు ఈ రహదారి బాగానే ఉండేది. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను ఈ మార్గం మీదుగా మళ్లించాలన్న నిర్ణయంతో సమస్యలు మొదలయ్యాయి. నిత్యం వేలాదిగా భారీ వాహనాల రాకపోకలతో రహదారి దెబ్బతింటూ వస్తోంది. నిర్వహణ పూర్తిగా గాలికొదిలేయడంతో.. చిన్న గుంతలు కాస్తా పెద్దవైపోయాయి. మరమ్మతుల కోసం స్థానికుల అభ్యర్థనలు అరణ్యరోదనలుగానే మిగిలాయి. 12 కిలోమీటర్ల పొడవైన ఈ మార్గంలో ప్రయాణానికి 10 నుంచి 15 నిమిషాలు పట్టేది. ఇప్పుడు గంట సమయం పడుతోంది.
20 అడుగుల వెడల్పున్న ఈ రహదారిపై హైదరాబాద్, భద్రాచలానికి వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. విజయవాడ కనకదుర్గ వారధి పనులు ప్రారంభించినప్పటి నుంచి భారీ వాహనాలను ఈ మార్గం వైపు మళ్లించారు. అంబాపురం, కండ్రిక, నయనవరం, పాతపాడు, జక్కంపూడి, తాడేపల్లి, కొత్తూరుతాడేపల్లి, వెలగలూరు ఈ మార్గంలోనే ఉన్నాయి.
జక్కంపూడిని జెట్‌సిటీగా అభివృద్ధి చేసేందుకు గత ప్రభుత్వం పెద్దఎత్తున గృహ నిర్మాణ కార్యక్రమం చేపట్టింది. స్థిరాస్తి రంగం బాగా అభివృద్ధి చెందింది. జక్కంపూడి కొండల్లో గ్రావెల్ క్వారీ పనులు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఫలితంగా ఈ మార్గంలో వాహనాలు నిర్విరామంగా తిరుగుతూనే ఉంటాయి. వీటి తాకిడిని రోడ్డు తట్టుకోలేకపోతోంది. మరమ్మతు పనులను గుత్తేదారు మధ్యలో వదిలేయడంతో... రహదారి పరిస్థితి మరింత ఘోరంగా మారింది. స్థానికులు మట్టి, గ్రావెల్‌ను గుంతల్లో నింపి తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నా...వర్షాలు, భారీ వాహనాల దెబ్బకు అవి కొట్టుకుపోతున్నాయి.
గుంతలమయమైన ఈ మార్గంలో ప్రయాణించడం వల్ల వాహనాలు, వాటిలో తీసుకెళ్లే వస్తువులు పాడైపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. ఇంధన, నిర్వహణ ఖర్చులు పెరిగి ఆర్థికంగా అదనపు భారంగా మారిందని ఆవేదన చెందుతున్నారు. రహదారులు- భవనాల శాఖ ఆధీనంలోని ప్రధాన రహదారుల మరమ్మతుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కరోనా విజృంభణ...కొత్తగా 10,276 కేసులు