విజయవాడ గ్రామీణ మండల పరిషత్ ఎన్నికల బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లలో వర్షపు నీరు చేరటంతో అధికారులు వాటిని మార్చారు. విజయవాడలోని మాంటిస్సోరి మహిళా కళాశాల సమావేశ మందిరం మొదటి అంతస్తులోని బ్యాలెట్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు స్ట్రాంగ్ రూమ్-2 పై కప్పు లీకై వర్షపునీరు బ్యాలెట్ బాక్సుల కిందకు చేరింది. దీంతో బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌లను కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్, రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థుల సమక్షంలో పోలీసు బందోబస్తు మధ్య తెరిచి చూశారు. నిడమనూరుకు చెందిన 107వ బ్యాలెట్ బాక్సులోకి నీరు చేరినట్లు గుర్తించారు. అలాగే స్ట్రాంగ్ రూమ్‌లలో తేమ కూడా ఉండటంతో తక్షణమే కొత్త స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అన్ని బ్యాలెట్ బాక్సులు సక్రమంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత కొత్తగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లలోకి వాటిని తరలించారు. మొత్తం 142 బూత్‌లకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను రెండు స్ట్రాంగ్ రూమ్‌ల్లోకి మార్పించి గదులకు సీల్ వేశారు. రెండు స్ట్రాంగ్ రూమ్‌లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయటంతో పాటు బ్యాలెట్ బాక్సులకు ఎలాంటి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఇదీ చదవండి
AP NOMINATED POSTS 2021: నామినేటెడ్ పదవులు దక్కింది వీరికే..