సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసే ప్లాస్టిక్ వస్తువులు మనిషి మనుగడను శాసిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా నిత్యం వినియోగించే ప్లాస్టిక్ కవర్లు పర్యావరణానికి తూట్లు పొడవడమే కాక జంతువుల ప్రాణాలను బలిగొంటున్నాయి. వీటిని నిషేధించాలని కాలుష్య నియంత్రణ మండలి కోరుతున్నా నగరాలు, పట్టణాల్లో ప్లాసిక్ కవర్లు విచ్చలవిడిగా వినియోగిస్తూనే ఉన్నారు. పర్యావరణానికి పెనుసవాల్‌గా మారిన ప్లాస్టిక్ సంచుల వినియోగాన్ని అరికట్టేలా విజయవాడ నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది.
ప్రత్యామ్నాయం దొరికింది
నగరంలో రోజూ పోగయ్యే చెత్తలో 4 టన్నుల ప్లాస్టిక్ సంచులే ఉన్నాయి. ఈ చెత్తను తగలబెడితే విడుదలయ్యే విషవాయువులు ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సరైన ప్రత్యామ్నాయం లేక ప్లాస్టిక్ బ్యాగులనే ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. అయితే ఇపుడు వీటికి పరిష్కారం దిశగా నీటిలో కరిగిపోయే సంచులను కోయంబత్తూరుకు చెందిన సంస్థ ఆవిష్కరించింది. వాటిని విజయవాడ నగరంలో వినియోగించే దిశగా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రస్తుత జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ రైతు బజార్లలో ప్లాస్టిక్ కవర్ల నిషేధాన్ని కచ్చితంగా అమలు చేయాలన్న ఆదేశాలతో అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో కవర్లను మార్కెట్ పరిసరాలలో వాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
సహకరిస్తున్న నగరవాసులు
ఒకేసారి నిషేధం విధించడం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. చేస్తున్నది మంచిపనే కాబట్టి ప్లాస్టిక్ సంచుల అమ్మకాలను పూర్తిగా ఆపేశామంటున్నారు మార్కెట్ అధికారులు. చాలామంది కొనుగోలుదారులు కూడా చేతి సంచులు... బుట్టలు తెచ్చుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని తెలిపారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వచ్చిన సంచుల వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులు నిర్ణయించారు. నగరంలో అవసరాల మేరకు వాటిని పంపిణి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.