ఏపీ డెయిరీ ప్లాంట్లు, ఆస్తులను ‘అమూల్’ సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయ ప్రభావం కృష్ణా జిల్లా పెనమలూరు ఏఎంసీ(ప్రధాన కేంద్రం కంకిపాడు)పై అధికంగా ఉంది. కంకిపాడు మార్కెట్ యార్డ్‌లోని వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఆర్‌సీసీ గిడ్డంగి, సుమారు 20 సెంట్ల స్థలాన్ని 2011లో ఏపీ డెయిరీకి లీజుకు ఇచ్చారు. ఐదారేళ్ల పాటు సమర్థవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత నిర్వహణ లోపంతో మూసివేశారు. ఇప్పటికి ఈ సంస్థ నుంచి సుమారు రూ.18 లక్షల మేర లీజు బకాయిలు ఏఎంసీకి రావాల్సి ఉంది. దీనిపై సంస్థకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పలుమార్లు తాఖీదులు జారీ చేసినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం నెలకు లీజు సొమ్ము రూ.41,655 చెల్లించాల్సి ఉంది. గత ఏడాది సెప్టెంబరులో ‘అమూల్’ ప్రతినిధుల బృందం ఈ ప్లాంట్‌ను పరిశీలించింది. రాష్ట్ర స్థాయిలో సంప్రదింపులు, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంతో కంకిపాడు మినీ డెయిరీ కూడా ‘అమూల్’కు అప్పగింత ఇక లాంఛనప్రాయమేనని చెబుతున్నారు.
చెల్లింపులపై సందేహాలు
వెయ్యి మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన భారీ ఆర్‌సీసీ భవనం, విశాలమైన స్థలం కంకిపాడు బస్టాండ్ కూడలికి సమీపంలో బందరు రహదారి పక్కనే ఉంది. దీన్ని అంతకు ముందు ఆరేళ్ల కిందట నిర్మించి రైతు బంధు పథకం అమలుకు ఉపయోగిస్తున్నారు. అప్పటి పాడి పరిశ్రమ శాఖా మంత్రి, ప్రస్తుత శాసన సభ్యుడు కె.పార్థసారథి కృషితో మినీ డెయిరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధి, ఉపాధి లభిస్తుందనే లక్ష్యంతో దీనికి అప్పటి ఏఎంసీ పాలకవర్గం అనుమతి ఇచ్చింది. వివిధ కారణాలతో మూత పడడంతో రావాల్సిన లీజు బకాయి పరిస్థితేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ‘అమూల్’ బృందం వచ్చిన రోజున ఏఎంసీ కొత్త పాలకవర్గం బకాయిల విషయాన్ని ప్రస్తావించి, ఆసొమ్ము చెల్లిస్తేనే ప్లాంట్‌ను అప్పగిస్తామని ఖరాకండిగా చెప్పారు. ఇక చెల్లింపు ప్రభుత్వ ఆదేశాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు.
లీజు నిర్ధారణపై స్పష్టత కోరతాం..
బకాయిలతో పాటు లీజు నిర్ధారణపై స్పష్టత కోరతాం. ఇది రైతుల సొమ్ము. వారి ప్రయోజనార్థమే ఉపయోగించాలి. ఆరేళ్ల కిందట లీజు సొమ్మును ప్రస్తుత విలువకు అనుగుణంగా పెంచాల్సి ఉంది. కొత్త వ్యవసాయ చట్టాలతో ఇప్పటికే ఏఎంసీ ఆదాయం 80 శాతం తగ్గింది.
- ఏఎంసీ ఛైర్మన్ మద్దాలి రామచంద్రరావు
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు