అసలు కారణం ఇదీ..
వాణిజ్య భవనాల్లో కళాశాలలు నిర్వహిస్తున్నారని, పక్కా భవనాలు లేవనే కారణాలతో తొలుత 600 ప్రైవేటు జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి అనుమతులు నిలిపివేసింది. తాజాగా వాటిలో 250 కళాశాలలకు అనుమతులిచ్చి, వాటిని ఆన్‌లైన్‌లో చేర్చారు. అయినా ఇప్పటికీ సుమారు 350 వరకు కళాశాలలకు అనుమతి రాలేదు. ఇలా ఇంకా అనుమతి రానివాటిలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రముఖ కళాశాలలూ ఉన్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటర్మీడియట్‌లో ఎక్కడ చేర్పించాలనే విషయమై ఒత్తిడికి గురవుతున్నారు.
తక్కువ సంఖ్యలో అనుమతుల వల్ల..
నీట్, జేఈఈ, ఎంసెట్ లాంటి పోటీ పరీక్షల్లో పిల్లలకు మంచి ర్యాంకులు సాధించాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు వాటికి శిక్షణ ఇచ్చే ప్రైవేట్ జూనియర్ కాలేజీలవైపు చూస్తుంటారు. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాల్లో.. అలాంటి కళాశాలలకు తక్కువ సంఖ్యలో అనుమతులు ఇవ్వడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పొరుగు రాష్ట్రాల వైపు చూస్తున్నారు. ఎక్కువమంది హైదరాబాద్‌లోను, రాయలసీమ జిల్లాల వారు బెంగళూరులోను తమ పిల్లలను చేర్చే ప్రయత్నాల్లో పడ్డారు.
ఇంకా ఆశగా చూస్తున్నారు..
కొందరు మాత్రం తామున్నచోట ప్రైవేట్ కళాశాలలు ఆన్‌లైన్‌లో కనపడతాయేమోనని ఇంకా ఆశగా ఎదురుచూస్తున్నారు. అసలు రాష్ట్రంలో అనుమతులున్న జూనియర్ కళాశాలలు ఎన్ని ఉన్నాయి? వాటిలో ఎన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయనే కనీస సమాచారాన్ని కూడా ఇంటర్ విద్యామండలి ఇంతవరకు అధికారికంగా విడుదల చేయలేదు. ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ ప్రవేశాలను నిర్వహిస్తున్న విషయమై అధికారులు సరిగా ప్రచారం చేయలేదు.
అవగాహన లేక..
దీంతో అవగాహన లేని తల్లిదండ్రులు పాత విధానంలో ఇప్పటికే తమ పిల్లలను వివిధ కళాశాలల్లో చేర్పించారు. ఇంటర్‌తోపాటు ఐఐటీ శిక్షణ కోసం ముందునుంచే బోధన ఉండటంతో జూన్, జులై నెలల్లోనే రుసుములు చెల్లించి పిల్లలను చేర్పించారు. వీరికి ఆన్‌లైన్ తరగతులు మొదలైపోయాయి కూడా. కానీ ఇప్పుడా కళాశాలల్లో కొన్ని మాత్రమే ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి కంటే ఎక్కువ శాఖలున్న ప్రైవేటు కళాశాలలు 306 ఉండగా.. పాతవిధానం ప్రకారం వీటిలో 2.50 లక్షల వరకు సీట్లు ఉన్నాయి. కానీ వాటిలో చాలా కాలేజీలకు ఇప్పుడు అనుమతులు లేవు. దాంతో ఆ సీట్లన్నీ గల్లంతయినట్లేనా అని, తమ పిల్లల పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
ఈ ఏడాది పదో తరగతి ఉత్తీర్ణులు 6.31 లక్షలు
మొదటి సంవత్సరంలో ఏటా ప్రవేశాలు 5 లక్షలు
తొలివిడత కౌన్సెలింగ్‌కు ఆసక్తి చూపినవారు 2 లక్షలు
కళాశాలలు, కోర్సుల ఎంపికకు ఐచ్ఛికాలు ఇచ్చినవారు 1.20 లక్షలు
ప్రభుత్వ కళాశాలల్లో లెక్చరర్లేరీ?
పలు కళాశాలలకు అనుమతులు నిలిపివేసిన అధికారులు.. ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించలేదు. పోనీ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏమైనా ప్రైవేటుకు దీటుగా ఉన్నాయా అంటే, అదీ లేదు. బోధన సిబ్బంది కొరత వల్ల వాటిలో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 447 ప్రభుత్వ కళాశాలలకు 4,800 మంది అధ్యాపకులు అవసరం. కానీ శాశ్వత ప్రాతిపదికన పనిచేసేవారు 700 మంది లోపే ! 84 ప్రభుత్వ కళాశాలలకు శాశ్వత లెక్చరర్లే లేరు. ఇలాంటి చోటుకు పిల్లల్ని పంపి, వారి భవిష్యత్తును పణంగా పెట్టేదెలాగన్నది తల్లిదండ్రుల ప్రశ్న.
అక్కడ ఇబ్బంది లేదు..
పొరుగునున్న తెలంగాణ రాష్ట్రంలో.. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో అదనపు సెక్షన్లకు ఎలాంటి ఇబ్బంది లేదని అక్కడి కళాశాలల వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు వచ్చినా, వారందరినీ చేర్చుకునేందుకూ అవకాశం ఉందని అంటున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను హైదరాబాద్ లాంటి నగరాలకు పంపేందుకు కూడా సిద్ధమవుతున్నారు.