2011 జనాభా లెక్కల ప్రకారం కృష్ణా జిల్లా నాగాయలంకలో ఆరేళ్ల వయసులోపు చిన్నారుల్లో వెయ్యిమంది బాలురకు కేవలం 768 మంది బాలికలు మాత్రమే ఉన్నారని గణాంకాల్లో నమోదైంది. నాగాయలంకలో 2002 నుంచి బాలబాలికల నిష్పత్తి ఇలాగే కొనసాగటం ఆందోళన కలిగిస్తున్న అంశం. దేశంలోనే కనిష్ఠ స్థాయిలో ఇక్కడ ఆడపిల్లల సంఖ్య ఉంది.
పుట్టబోయే బిడ్డ ఆడపిల్ల అని తెలుసుకుని.... గర్భస్రావాలు చేయించుకుంటున్నవారు ఇంకా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. ఈ కారణంగా కూడా బాలికల జననాలు తగ్గిపోతున్నాయని అంటున్నారు. ప్రభుత్వ వైద్యులు, అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు... గర్భిణీలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల్లో ఆడ, మగ అనే తేడాలు చూడరాదని, ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని వారికి హితబోధ చేస్తున్నారు. అమ్మాయిల పెంపకం భారం కాదని చెబుతున్నారు. ప్రస్తుతం ఆడపిల్లలు పెద్ద చదువులు చదివి ఉన్నత స్థానాల్లో రాణిస్తున్నారని వివరిస్తున్నారు. నాగాయలంకలో అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం వల్ల సరైన వయసులో పెళ్లి కాని యువకులు ఎక్కువ మందే ఉంటున్నారు.
2019లో నాగాయలంక మండలంలో అంగన్‌వాడీ సిబ్బంది నమోదు చేసిన వివరాల ప్రకారం... 161 మంది బాలురు జన్మిస్తే... 149 మంది బాలికలు జన్మించారు. గతంతో పోలిస్తే కొంతవరకు ఆడపిల్లల సంఖ్య పెరిగినట్టే. 2021 జనాభా లెక్కల సమయానికి ఆ సంఖ్య మరింత పెరగాలని ఆశిద్దాం.
ఇదీ చదవండి: పురపాలిక, నగర పంచాయతీల్లో రిజర్వేషన్లు ఖరారు..ఎన్నికలకు నేడు ప్రకటన